సునామీ ఎందుకు వచ్చింది?

25 Dec, 2018 03:31 IST|Sakshi
సునామీ ధాటికి నేలమట్టమైన సుమర్‌ గ్రామం

ఇండోనేసియాలో ఆనక్‌ క్రకటోవా విధ్వంసంపై శాస్త్రవేత్తల మనోగతం

ఇండోనేసియాలో తీవ్ర విధ్వంసం సృష్టించిన సునామీ రాకకు గల కారణాలపై శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఆనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం దక్షిణ పార్శ్వంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలిపోవడంతో సునామీ వచ్చిందని తేల్చారు. ‘ఒక కొండచరియ విరిగిపడినట్టుగా అకస్మాత్తుగా అగ్ని పర్వతంలోని ఒక భాగం పడిపోవడంతో నీరు స్థానభ్రంశం చెంది తరంగాలు నిట్టనిలువుగా పైకి విరజిమ్మాయి.దీంతో ఒకేసారి రాకాసి అలలు తీర ప్రాంతంపై విరుచుకుపడ్డాయి‘ అని భూకంప అధ్యయన శాస్త్రవేత్త శ్యామ్‌ టేలర్‌ అభిప్రాయపడ్డారు. అయితే, కచ్చితంగా ఇలాగే జరిగి ఉంటుందని చెప్పడానికి ఆధారాలు ఉండవన్నారు.  


జావా, సుమత్రా దీవుల మధ్య ఉన్న ఆనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం గత కొన్ని నెలలుగా లావాను విరజిమ్ముతోంది. సునామీ రావడానికి సరిగ్గా 24 నిమిషాలు ముందు అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలిపోయిందని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. అగ్నిపర్వతంలోని ఒక భాగం కుప్పకూలడం వల్ల దాని పైకప్పు తెరుచుకుని విస్ఫోటం ఏర్పడుతుంది. ఆ శిథిలాలు ఒకేసారి సముద్రంలో పడిపోవడం వల్ల నీరు కొన్ని వందల మీటర్లు పైకి ఎగజిమ్ముతుందని టేలర్‌ వివరించారు. అగ్ని పర్వతం సింహభాగం కుప్పకూలడం వల్లనే రాకాసి అలలు దూసుకువచ్చాయన్నారు.

భూకంపం కూడా వచ్చిందా ?
సునామీకి ముందు ఆనక్‌ క్రకటోవా అగ్నిపర్వతానికి 25 కిలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించిందని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియో సైన్సెస్‌ వెల్లడించింది. ‘భూకంపం ప్రభావం అగ్నిపర్వతంపై పడింది. దాంతో పర్వతం ఒరిగిపడింది. సముద్ర మట్టానికి 300 మీటర్లకు పైగా ఎత్తులో క్రకటోవా అగ్నిపర్వతం ఉండడంతో భారీగా ఉన్న దాని శకలాలు అంతెత్తు నుంచి నీళ్లలో పడడంతో సునామీ ముంచెత్తింది’ అని తెలిపింది.  

ముందు సంకేతాలు ఎందుకు లేవంటే  

ఆనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం నిరంతరం చప్పుళ్లు చేస్తూ ఉండడంతో ఆ ప్రాంతంలో శబ్ధ కాలుష్యం నెలకొంది. దీంతో అది కూలిపోయినా ఆ శబ్దాన్ని ఎవరూ అంతగా గుర్తించలేదు. అంతేకాకుండా భూకంపం వల్ల కాకుండా, అగ్నిపర్వతం కూలడంతో సునామీ రావడం వల్ల భూకంప నమోదు కేంద్రాల్లో సిగ్నల్స్‌కి కూడా అది అందలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి కంపించడం, సముద్రం ఉప్పొంగడం వంటి సూచనలేవీ లేకుండా అకస్మాత్తుగా 10 అడుగుల ఎత్తుకి అలలు ఎగసిపడటంతో భారీ నష్టం సంభవించిందని తెలిపారు. అగ్ని పర్వతం విరిగిపడిన సుమారు 24 నిమిషాల తర్వాత నిశ్శబ్ద సునామీ సంభవించడంతో యంత్రాంగం అప్రమత్తం అయి ప్రజలకు హెచ్చరికలు చేసేందుకు ఎలాంటి వ్యవధి లేకుండాపోయిందన్నారు. అగ్నిపర్వతం కారణంగా సునామీలు ఏర్పడటం అరుదైన విషయమని అందువల్ల ముందుగా తెలుసుకోవడం కష్టమయిందని నిపుణులు అంటున్నారు. అయితే, క్రకటోవా ఇంకా ఎగసిపడుతూనే ఉందని, మరో నెల లేదంటే ఏడాదిలో ఇది విరిగిపడి మరో భీకర ప్రళయం సంభవించవచ్చని మరో శాస్త్రవేత్త మెక్‌కినన్‌ హెచ్చరించారు.   

పాప్‌ గ్రూప్‌లో ఒక్కరే సజీవం
సునామీ రాక్షస అలల్లో చిక్కిన ‘సెవెంటీన్‌’ పాప్‌ గ్రూప్‌ సభ్యుల్లో ఒక్కరు తప్ప దాదాపు అందరూ చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ గ్రూప్‌ మేనేజర్‌ ఒకి విజయ, హెర్మాన్‌ సికుంబాంగ్, రుక్మానా రుస్తం, విష్ణు ఆండీ ధర్మవాన్‌లకు బంధువులు, స్నేహితులు కన్నీటి వీడ్కోలు పలికారు. పాప్‌ బృందంలోని రీఫియన్‌ ఫజర్‌శ్యా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.  ‘సెవెంటీన్‌’ పాప్‌ గ్రూప్‌ జావాలోని టాన్‌జుంగ్‌ బీచ్‌ రిసార్టులో ప్రదర్శన సమయంలో సునామీ విరుచుకుపడింది.

సునామీ మృతులు 373
జకార్తా: ఇండోనేసియా సునామీలో సజీవంగా ఉన్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. శనివారం రాత్రి సంభవించిన ఈ విలయంలో మృతుల సంఖ్య 373కు చేరుకుందని జాతీయ ప్రకృతి విపత్తుల స్పందన సంస్థ అధికార ప్రతినిధి సుటొపో పుర్వో నుగ్రొహో సోమవారం తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మరో 128 మంది జాడ తెలియాల్సి ఉండగా, గాయపడిన 1,459 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. శనివారం రాత్రి సముద్ర గర్భంలోని ఒక అగ్ని పర్వతం బద్ధలై.. పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులపై ఆకస్మికంగా విరుచుకుపడి తీవ్ర విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. మరింత తీవ్రతతో అలలు తీరంపైకి విరుచుకుపడే అవకాశముందని నిపుణులు హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది.

281 మందికి అంత్యక్రియలు..
సునామీలో ప్రాణాలు కోల్పోయిన 281 మందికి ఇప్పటి వరకు అంత్యక్రియలు నిర్వహించినట్లు సుటొపో పుర్వో నుగ్రొహో తెలిపారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కరిటా బీచ్‌ ప్రాంతంలో ధ్వంసమైన వందలాది భవనాల శకలాలను తొలగిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన, సజీవంగా ఉన్న వారి కోసం వందలాది మంది సైనిక సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు తీరం వెంబడి గాలిస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ తదితర అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలను చేపట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించాయి. ఈ సహాయక చర్యలు మరో వారం పాటు కొనసాగే అవకాశాలున్నాయి. బాధిత ప్రాంతాలను సోమవారం అధ్యక్షుడు విడోడో సందర్శించారు.
 

మరిన్ని వార్తలు