ఆయన సూట్‌ వేసుకున్న టెర్రరిస్టు..

5 Jan, 2020 19:09 IST|Sakshi

దుబాయ్‌ : తమకు హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ట్రంప్‌ను సూట్‌లో ఉన్న టెర్రరిస్ట్‌గా అభివర్ణించింది. ‘ఐసిస్‌, హిట్లర్‌ తరహాలో వారంతా విద్వేష సంస్కృతికి చెందిన వారు..ట్రంప్‌ సూట్‌లో ఉన్న టెర్రరిస్ట్‌..గొప్ప సంస్కృతి కలిగిన దేశమైన ఇరాన్‌ను ఎవరూ ఓడించలేరని త్వరలోనే ఆయనకు తెలిసివస్తుంద’ని ఆ దేశ సమాచార, టెలికమ్యూనికేషన్ల మంత్రి మహ్మద్‌ జవద్‌ అజారి జహ్రోమి ట్వీట్‌ చేశారు. బాగ్ధాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా దళాలు శుక్రవారం జరిపిన డ్రోన్‌ దాడిలో ఇరాన్‌ మిలటరీ కమాండర్‌ సులేమాని మరణించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చుమీరాయి.

కాగా తమ దేశ పౌరులపై గానీ, ఆస్తులపై గానీ దాడులు జరిగితే చూస్తు ఊరుకోబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.తమపై దాడికి తెగబడితే చాలా వేగంగా.. తీవ్రంగా స్పందిస్తామని ఆయన తెలిపారు. ఇరాన్‌లోని 52 ప్రదేశాలను లక్ష్యంగా ఎంచుకున్నామని వెల్లడించారు. ఆ లక్ష్యాల్లో ఇరాన్‌లోని ముఖ్య ప్రదేశాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇరాన్‌ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు