ఎందు కాలిడినా.. ప్యూర్‌ నీరు!

22 Aug, 2017 02:55 IST|Sakshi
మంచినీటిని శుద్ధి చేసే ‘ఆఫ్‌ గ్రిడ్‌ బాక్స్‌’

స్వచ్ఛమైన నీళ్లుంటే.. బోలెడన్ని రోగాలను అడ్డుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దురదృష్టం కొద్దీ స్వచ్ఛమైన నీళ్లు దొరకకనే ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. మరణిస్తున్నారు కూడా. ఎక్కడో విసిరేసినట్టుగా ఉన్న పల్లెటూళ్లలో నీటి శుద్ధికి అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. ఇకపై ఈ సమస్య అస్సలు ఉండదంటోంది ‘ద ఆఫ్‌ గ్రిడ్‌ బాక్స్‌’. ఈ ఇటలీ కంపెనీ తయారు చేసిన మంచినీళ్ల యంత్రమే మీకు ఫొటోలో కనిపిస్తున్నది.

దీంతో ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీళ్లను తయారు చేసుకోవడం మాత్రమే కాకుండా.. కరెంటూ ఉత్పత్తి చేసుకోవచ్చు మరి! ఆరు అడుగుల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండే ఈ పెట్టె లోపలి భాగంలో నీళ్లను శుద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఉంటే, బయట ఆ యంత్రాలను నడిపేందుకు, కావాల్సిన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు సోలార్‌ప్యానెల్స్‌ ఉన్నాయి. సోలార్‌ప్యానెల్స్‌కు దిగువన శుద్ధి చేయాల్సిన నీటిని వేడి చేసేందుకు సోలార్‌హీటింగ్‌ యంత్రాలూ ఉన్నాయి. దీంతో ప్రత్యేకంగా విద్యుత్తులైన్లు వేసుకోవాల్సిన పనిలేకుండా ఏ మారుమూల ప్రాంతంలోనైనా కలుషిత నీటిని శుద్ధి చేసి అందించేందుకు వీలేర్పడుతుంది. యంత్రాలు వాడుకోగా మిగిలిన విద్యుత్తును ఆయా ప్రాంతాల్లో బల్బులు వెలిగించేందుకైనా, ఫోన్లు చార్జ్‌ చేసుకునేందుకైనా వాడుకోవచ్చు.

మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు.

అవసరాన్ని బట్టి కొంచెం పెద్ద పెద్ద బాక్సులు కూడా దొరుకుతాయి. బేసిక్‌ మోడల్‌లో 12 సోలార్‌ ప్యానెళ్లు, ఇన్వర్టర్, బ్యాటరీలు ఉన్నాయి. ఈ బ్యాటరీతో దాదాపు మూడు ఎల్‌ఈడీ లైట్లను దాదాపు నాలుగు గంటలపాటు వెలిగించవచ్చు. 1,200 లీటర్ల నీటిని శుద్ధి చేయగల ఈ యంత్రంలో నీటిని నిల్వ చేసేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. ఒక్కో బాక్స్‌ ద్వారా కనీసం 1,500 మందికి తాగునీరు అందించవచ్చు. ఆఫ్రికాలోని పేదదేశాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ సీఈవో ఇమిలియానో కొచినీ చెబుతున్నారు.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

1. మంచినీటిని శుద్ధి చేసే ‘ఆఫ్‌ గ్రిడ్‌ బాక్స్‌’.
2. మారుమూల ప్రాంతాలలోని నీటిని సైతం ఈ బాక్సుతో శుద్ధి చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు