ఆ డెలివరీ బోయ్ అంటే నేరస్తులకు దడదడ!

1 Nov, 2016 12:37 IST|Sakshi
ఆ డెలివరీ బోయ్ అంటే నేరస్తులకు దడదడ!
జపాన్‌లో నేరస్తుల పాలిట ఓ డెలివరీ బోయ్ సింహస్వప్నంలా మారాడు. ఆయుధాలతో వచ్చిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను ఉత్త చేతులతో ఎదిరించి, అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మత్సుబా - కై క్రైం సిండికేట్‌కు చెందిన ఇద్దరు నిందితులు యుసుకె కొడమా (32), హిడెకజు ఒబా (35) ఇద్దరూ దోపిడీకి ప్రయత్నించి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వీళ్లిద్దరూ ఒక నకిలీ తుపాకీని డెలివరీ బోయ్ (38) ముఖంపై ఆడించి.. అతడి వద్ద ఉన్న ఓ ఖరీదైన వాచీని దోచుకోడానికి ప్రయత్నించారు. దాంతో చికాకు వచ్చిన ఆ బోయ్.. వాళ్ల దగ్గర్నుంచి ఆ తుపాకి లాక్కుని, తన ప్యాకేజిని కూడా వెనక్కి తీసుకున్నాడని టోక్యో పోలీసులు తెలిపారు. దాదాపు రూ. 5.33 లక్షల విలువచేసే రోలెక్స్ వాచీ కోసం ఒబా ఆర్డర్ చేశాడు. దానికి సంబంధించిన డబ్బు చెల్లించాల్సి వచ్చినప్పుడు.. డెలివరీ బోయ్‌ ముఖం మీద నకిలీ తుపాకి చూపించి, అక్కడినుంచి వెంటనే వెళ్లిపోవాలని బెదిరించారు. భయపడటానికి బదులు ఆ డెలివరీ బోయ్ వాళ్ల నుంచి తుపాకి లాక్కుని, పోలీసులకు ఫోన్ చేశాడు. 
 
డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి తమకంటే చాలా బలంగా ఉన్నాడని, అతడి ముందు తాము నిలబడలేకపోయామని పోలీసుల వద్ద ఒబా అంగీకరించాడు. ఇటీవలి కాలంలో దొంగలను కేవలం పోలీసులే కాక.. జపాన్ పౌరులు కూడా గట్టిగానే ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ డెలివరీ బోయ్‌లాగే వాళ్లు కూడా తమ పేర్లను మాత్రం వెల్లడించడం లేదు. 
మరిన్ని వార్తలు