Zomato Jobs: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు

2 Nov, 2023 15:50 IST|Sakshi

దిగ్గజ ఫుడ్‌ డెలివరీ సంస్థ అయిన జొమాటో ఉద్యోగాల నియామకంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులను తమ కంపెనీలో ఇకపై ఉద్యోగాలు ఇవ్వబోమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్‌ రణ్‌వీర్ అల్లాబాడియాతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు. సంస్థ ఉద్యోగ నియామకం భిన్నమైందని ఆయన అన్నారు. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉద్యోగాలు ఇవ్వమని, ఎలాంటి పనిగురించి వెతకకుండా, నమ్మకంగా పని చేసే ‍స్వభావం ఉ‍న్న వారికే తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

జొమాటో ప్రారంభించి 15 ఏళ్లు అయిందన్నారు. సంస్థలో గత 5-6 ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీ అవసరాలకు సరిపడా ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల వల్ల కొత్తవారిని నియమించుకోవాలంటే మాత్రం వారి నైపుణ్యాలకే అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘కొత్తవారిని నియమించాలంటే ఇంటర్వ్యూకు మూడు నెలలు సమయం అయిపోతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పాసైతే పాత సంస్థలో మరో మూడు నెలలు నోటీస్‌ పీరియడ్‌ ఉంటుంది. సంస్థ కార్యకలాపాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మరింత సమయం పడుతుంది. అభ్యర్థి పనితనం గురించి తెలియాలంటే మరో ఏడాది సమయం పడుతుంది. మొత్తం దాదాపు 2 ఏళ్లు వృథా అవుతాయి’అని గోయల్‌ అభిప్రాయపడ్డారు. దానికిబదులుగా సంస్థలోని వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతస్థానంలో నియమిస్తే కంపెనీ విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి పెద్దగా సమస్య ఉండదని చెప్పారు.

మరిన్ని వార్తలు