ట్రాఫిక్ జామ్‌లో డెలివరీ బాయ్ సాహసం.. ఆన్‌టైమ్‌లో పిజ్జా అందించి

28 Sep, 2023 17:08 IST|Sakshi

బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి.   

ఆన్‌టైమ్‌ డెలివరీ..  
ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్‌పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.    

బారులు తీరిన వాహనాలు.. 
ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. 

ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్‌ఫారం ఎక్కించేశాడు..

మరిన్ని వార్తలు