రైనోలను వేటాడితే మరణ దండనే..

1 Apr, 2018 22:36 IST|Sakshi
మగ రైనో ‘సుడాన్‌’

కెన్యా: భూగోళంపై అంతరించి పోతున్న జీవజాతుల జాబితాలోకి ఉత్తర ప్రాంతపు తెలుపు జాతి రైనో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒకే ఒక మగ రైనో ‘సుడాన్‌’  (45) గత నెలలో అనారోగ్యంతో కెన్యాలోని ఓల్‌ పెజెటా జాతీయ పార్కులో మరణించిన సంగతి తెలిసిందే. ఏనుగులు, రైనోల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. అరుదైన జాతికి చెందిన ఈ తెల్ల రైనోల దంతాల కోసం స్మగ్లర్లు విచ్చల విడిగా వేటాడటంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. ఇందుకోసం కెన్యా ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. రైనోలను వేటాడితే వారికి మరణశిక్ష తప్పదని తెలిపింది.

అయితే మగ రైనో సుడాన్‌ను సంరక్షించి ఆ జాతిని వృద్ధి చేద్దామనుకున్న పార్కు నిర్వాహకులకు నిరాశే మిగిలింది. కండరాల, ఎముకల క్షీణత వ్యాధితో బాధపడుతూ సుడాన్‌ మరణించింది. ప్రపంచం మొత్తంలో గల రెండు వైట్‌ రైనోలు సుడాన్‌ సంతతే. సుడాన్ మృతితో దాని సంతానం నాజిన్‌(27), ఫతు(17) చిన్నబోయాయి. అవి రెండూ కన్నీరు కారుస్తూ.. సుడాన్‌ మృతి పట్ల మౌనం వహించాయి.

పార్కు నిర్వాహకులు సుడాన్‌ స్మృతి చిహ్నం వద్ద శనివారం ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమంలో నాజిన్, ఫతులు మౌనంగా రోదిస్తున్న దృశ్యాలు జంతు ప్రేమికులతో సహా ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశాయి. ఆ దిశగా కెన్యా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇకపై ఏనుగు, రైనోల దంతాల స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారికి మరణశిక్ష విధిస్తామని తెలిపింది. ఆ మేరకు కెన్యా ప్రభుత్వం చట్టం కూడా తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు