ఖలిస్తానీల ఆగడాలను అడ్డుకోండి

17 Nov, 2023 06:14 IST|Sakshi

యూకే హోంమంత్రికి జైశంకర్‌ వినతి  

లండన్‌: దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) హోం శాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ, జాతీయ భద్రతా సలహాదారు టిమ్‌ బారోకు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ విజ్ఞప్తి చేశారు. యూకేలో ఖలిస్తాన్‌ తీవ్రవాదం నానాటికీ పెరిగిపోతుండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తాన్‌ సభ్యుల ఆగడాలు, భారత్‌కు వ్యతిరేకంగా వారు సాగిస్తున్న కార్యకలాపాలను జేమ్స్‌ క్లెవర్లీ, టిమ్‌ బారో దృష్టికి తీసుకెళ్లారు.

జైశంకర్‌ బుధవారం లండన్‌లో వారిద్దరితో సమావేశమయ్యారు. ఖలిస్తాన్‌ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. అనంతరం యూకే ప్రధానమంత్రి రిషి సునాక్‌తో భేటీ అయ్యారు. ఇండియా–యూకే సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ఇండియా–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రస్తుతం జరుగుతున్న సంప్రదింపులతోపాటు రోడ్‌మ్యాప్‌–2030 అమలు తీరును ఇరువురు నేతలు సమీక్షించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్లో సానుకూల పురోగతి కనిపిస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు. యూకేలో జైశంకర్‌ ఐదు రోజుల పర్యటన బుధవారం ముగిసింది.  

మరిన్ని వార్తలు