విసిగిపోయిన కూలీ.. ఇప్పుడు హీరో!!

25 Apr, 2019 16:15 IST|Sakshi

పాలకుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన ఓ వ్యక్తి ఊరి సమస్యను పరిష్కరించేందుకు తానే నడుం బిగించాడు. కిలోమీటరు మేర స్వయంగా రోడ్డు నిర్మించి అందరి చేత హీరో అనిపించుకుంటున్నాడు. కెన్యాలోని కగండా గ్రామానికి చెందిన రోజూవారీ కూలీ నికోలస్‌ ముచామి.. పొదలతో నిండిపోయిన రోడ్డును బాగు చేయాలంటూ ప్రభుత్వాధికారులకు ఎన్నోసార్లు అర్జీలు పెట్టాడు. కొండప్రాంతంలో ఉన్న తమ గ్రామం నుంచి బాహ్య ప్రపంచానికి వెళ్లడానికి మహిళలు, పిల్లలు, వృద్ధులు పడుతున్న అగచాట్ల గురించి వివరించాడు. కానీ అధికారులు మాత్రం ఏమాత్రం స్పందించకుండా.. అసలు ఇదొక సమస్యే కాదన్నట్లు తేలిగ్గా తీసుకున్నారు.

ఉదయం 6 గంటలకే మొదలు..
ఈ విషయం గురించి ముచామి మాట్లాడుతూ.. ‘ మట్టిరోడ్డు సరిగ్గా లేక ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడ్డాం. స్థానిక నాయకులు, అధికారులకు లెక్కలేనన్ని వినతి పత్రాలు ఇచ్చాను. కానీ ఫలితం మాత్రం శూన్యం. అందుకే నేనే రంగంలోకి దిగాను. రోజూ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం ఆరింటి దాకా శ్రమించాను. నా దగ్గరున్న పనిముట్ల సాయంతో రోడ్డు నిర్మించా. దగ్గర్లోని షాపింగ్‌ సెంటర్‌, చర్చికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసమే నేను ఈ పనికి పూనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. కష్టాల నుంచి తమకు విముక్తి కలిగించిన ముచామికి రుణపడి ఉంటామని కగండా గ్రామస్తులు అతడిని ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు