సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం

1 Sep, 2015 13:48 IST|Sakshi
సముద్రంలో మునిగిపోతున్న అమెరికా గ్రామం

అలాస్కా : భూగోళంపై నానాటికి పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయని, సముద్రాలు అల్లకల్లోలంగా మారుతున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఏదో రోజు మానవ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుందనే హెచ్చరికలూ విన్నాం. ఇప్పుడు కళ్లారా చూసే రోజులొస్తున్నాయి. మొన్నటి వరకు చుట్టూరా నిశ్చలమైన నీలి సముద్రపు కెరటాలు, పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికా అలాస్కా రాష్ట్రంలోని కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలసిపోనుంది.

ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉన్న కివలిన గ్రామం ఇప్పుడు కేవలం ఎనిమిది నుంచి పదడుగుల దూరానికి చేరింది. 2025 నాటికి కచ్చితంగా ఆ గ్రామం సముద్ర గర్భంలో పూర్తిగా కలసిపోతుందని ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించిన అమెరికా ఆర్మీ పటాలం ఇంజనీర్లు తేల్చి చెప్పారు. ఆర్కటిక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. అందులో ప్రస్తుతం 403 మంది నివసిస్తున్నారు.

ఆ గ్రామం ఎలాగూ మునిగిపోతుందని తెలిసి అలాస్కా ప్రభుత్వం అక్కడ మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎలాంటి పెట్టుబడులు పెట్టినా అవి సముద్ర జలాల్లో కలిసిపోతాయని భావిస్తోంది. ఒకప్పుడు పండ్లతోటలు, తిమింగళాల వేటపై బతికిన అక్కడి ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పై ఆధారపడి బతుకుతున్నారు. అంతో ఇంతో స్తోమత కలిగిన వాళ్లు అలాస్కా నగరం వైపు వలసపోగా, నిర్భాగ్యులు అక్కడే ఉండిపోయారు. ఎక్కడకు పోవాలో, ఎలా బతకాలో తెలియక అల్లాడిపోతున్నారని 'ది లాస్ ఏంజెలిస్ టైమ్స్' వెల్లడించింది. ఆ దీప గ్రామాన్ని 1847లో రష్యా నేవీ కనుగొన్నది. 1960లో అక్కడ ఎయిర్ స్ట్రీమ్ను అమెరికా ప్రభుత్వం నిర్మించింది.

అప్పుడు పొడవాటి బీచ్లతో, ప్రకృతి రమనీయతతో అలరారుతుండేది. అర్కెటిక్ ప్రాంతంలోని మంచు పర్వతాలు కరగడంతో చెలరేగిన తుఫానుల కారణంగా బీచ్లన్నీ మాయం అవుతూ వచ్చాయి. సముద్రం ఆటుపోట్లను అరికట్టేందుకు సముద్రం ఒడ్డున 2011లో నిర్మించిన అడ్డుగోడలు కూడా ఇటీవలి తుఫానులకు కొట్టుకుపోయాయి. భూతాపంపై జరుగుతున్న ఓ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం అలాస్కా నగరానికి చేరుకున్నారు. భూతాపోన్నతికి ప్రత్యక్ష సాక్షిగా బలవుతున్న తమ గ్రామాన్ని పట్టించుకుంటారేమోనని ఆ గ్రామస్తులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు