లేటుగా పడుకుంటున్నారా.. జాగ్రత్త!

4 Apr, 2017 13:01 IST|Sakshi
లేటుగా పడుకుంటున్నారా.. జాగ్రత్త!

మీకు మధుమేహం ఉందా.. రోజూ రాత్రిపూట లేటుగా నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త. మీకు డిప్రెషన్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. సాయంత్రం పూట ఎక్కువ పనిచేస్తూ, రాత్రిళ్లు లేటుగా పడుకుంటూ ఎక్కువసేపు మేలుకునే ఉండేవాళ్లలో టైప్ 2 మధుమేహం బాధితులకు డిప్రెషన్ చాలా త్వరగా వస్తుందని అంటున్నారు. లేటుగా పడుకునేవాళ్లకు ఎంత బాగా నిద్రపట్టినా, తొందరగా పడుకుని త్వరగా లేచేవాళ్ల కంటే వీళ్లకు డిప్రెషన్ ముప్పు ఎక్కువేనట.

టైప్ 2 మధుమేహ బాధితుల్లో చాలామందికి ఈమధ్య డిప్రెషన్ కనపడుతోందని, అందువల్ల వాళ్లు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పరిశోధనలకు నేతృత్వం వహించిన థాయ్‌లాండ్‌లోని మహిడోల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సిరిమన్ రూట్రకుల్ చెప్పారు. సర్కాడియన్ ఫంక్షనింగ్‌కు, డిప్రెషన్‌కు మధ్య సంబంధం గురించి మరింత తెలుసుకోవడం వల్ల మధుమేహ రోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎండోక్రైన్ సొసైటీ 99వ వార్షిక సమావేశంలో చూపించారు. రోజు మొత్తమ్మీద ఏ సమయంలో నిద్రపోతున్నారనే విషయం చాలా ముఖ్యమని, దాన్ని బట్టే మధుమేహ బాధితుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని వివరించారు.

మరిన్ని వార్తలు