మిషన్‌ ఇంపాజిబుల్‌కు కశ్మీర్‌ కట్స్‌

31 Jul, 2018 22:16 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా జులై 27న విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్న టామ్‌  క్రూయిజ్‌ మిషన్‌ ఇంపాజిబుల్‌ ఫాలవుట్‌లో కొన్ని సన్నివేశాలపై భారత్‌లో కత్తెర పడింది. ఈ సినిమా క్లైమాక్స్‌ అంతా కశ్మీర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో నడుస్తుంది. అందులో కశ్మీర్‌ ప్రస్తావన వచ్చినప్పుడు చూపించిన మ్యాప్‌లు, మరికొన్ని ఇతర అంశాలపై సెన్సార్‌ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మ్యాప్‌లో కశ్మీర్‌ సరిహద్దుల్ని తప్పుగా గుర్తించడమే కాదు, భారత్‌ ఆధీనంలో కశ్మీర్‌ అంటూ ఉదహరించారు.

వినోదం కోసం దేశ సమగ్రతకు సంబంధించిన అంశాలపై రాజీపడే ప్రసక్తే లేదని ఆ చిత్ర నిర్మాతలకు స్పష్టం చేసినట్టు  సెన్సార్‌ బోర్డు చైర్మన్‌  ప్రసూన్‌ జోషి వెల్లడించారు. కశ్మీర్‌ మ్యాప్‌ను సరిగా చూపించాలని, లేదంటే ఆ సన్నివేశాన్ని తొలగించాలని,  కశ్మీర్‌ను భారత రాష్ట్రంలా చూపించాలంటూ ఆదేశించారు.  మొత్తం నాలుగు కట్స్, కొన్ని సవరణల్ని చెప్పారు. అంతే కాదు తమ చిత్రం ఏ మతం, వర్గం , ప్రాంతం, , దేశం వారి మనోభావాలను దెబ్బ తీయడానికి ఉద్దేశించినది కాదంటూ సినిమా మొదలవడానికి ముందు వెయ్యాలని కూడా ఆదేశించారు. భారత్‌లో విడుదలైన చిత్రానికి సంబంధించినంత వరకు వీటన్నింటినీ అమలు చేశారు. అయితే లడఖ్‌ ప్రాంతంలోని సియాచిన్‌ గ్లాసియర్, నూబ్రా లోయలకు సంబంధించిన ప్రస్తావనను అలాగే ఉంచేశారు.

ఈ చిత్రాన్ని తొలుత భారత్‌లోనే షూట్‌ చేద్దామని భావించారు చిత్ర దర్శకుడు క్రిస్టోఫర్‌ మెక్వెరీ. చాలాసార్లు కశ్మీర్‌ అంతా తిరిగి కథకి అవసరమైన లొకేషన్‌ కోసం వెతికారు. ఒక హెలికాప్టర్‌ ఛేజింగ్‌ సన్నివేశం చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ శాంతి భద్రతల సమస్యతో న్యూజిలాండ్‌లో కశ్మీర్‌ను తలపించే సెట్‌ వేసి షూటింగ్‌ పూర్తి చేశారు. భారత్‌లో కనిపించే వైవిధ్యం తనకెంతో ఇష్టమని, అదంతా సినిమా క్లైమాక్స్‌లో వచ్చేలా చూసుకున్నామంటూ చిత్ర ప్రోమోషన్‌ సమయంలో క్రిస్టోఫర్‌ వివరించారు. మొదటి వీకెండ్‌కే ఈ సినిమా భారత్‌లో 56 కోట్లను కొల్లగొట్టి బాక్సాఫీస్‌ దగ్గర తిరుగులేని హిట్‌గా నిలిచింది. హాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ పుల్‌ సిరీస్‌ మిషన్‌ ఇంపాజిబుల్‌.. ఇందులో ఆరో భాగంగా ఈ ఫాలవుట్‌ వచ్చింది. ఇందులో హీరో టామ్‌ క్రూయిజ్‌ ఇంపాజిబుల్‌ అనుకునే మిషన్‌ను చేపడతాడు. ఆ క్రమంలో వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్స్‌ ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. హీరో టామ్‌ క్రూయిజ్‌ చేసే విన్యాసాలు ఈ సినిమాలకు అదనపు ఆకర్షణ.  టెర్రరిస్టుల చేతుల్లో ప్లుటోనియం బాంబులు పడడం, వాటిని హీరో తిరిగి చేజిక్కించుకోవడం అనే కథాంశంతో ఫాలవుట్‌ని తీశారు. 
 

మరిన్ని వార్తలు