కంటి వ్యాధులను గుర్తించే... మాలిక్యులర్ మ్యాపు!

4 Aug, 2014 00:36 IST|Sakshi
కంటి వ్యాధులను గుర్తించే... మాలిక్యులర్ మ్యాపు!

కరెంటు పోయినప్పుడు టీవీ తెరపై ప్రత్యక్షమయ్యే చారలకు సంబంధించిన ఫొటోలా ఉంది కదూ! కానీ కాదు. అంధత్వానికి కారణమయ్యే కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే అణుస్థాయి చిత్రపటం(మాలిక్యులర్ మ్యాపు) ఇది. కంటిలోని నేత్రపటలంపై ప్రొటీన్లు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయన్నది ఈ మ్యాపు సాయంతో తెలుసుకోవచ్చట. ఈ ప్రొటీన్ల స్థాయిని బట్టి అంధత్వం, కంటి వ్యాధులను కచ్చితత్వంతో గుర్తించడమే కాకుండా..

వాటికి కచ్చితమైన చికిత్సలు కూడా చేయవచ్చట. రెటీనాకు ఆక్సిజన్‌ను, రక్తాన్ని సరఫరా చేసే నేత్రపటలంలో 4 వేలకు పైగా ప్రొటీన్ల సమాచారాన్ని ఈ హై రిజల్యూషన్ మాలిక్యులర్ మ్యాపు ద్వారా అధ్యయనం చేయవచ్చని, అణుస్థాయిలో ఇలా కంటి వ్యాధులను గుర్తించేందుకు ఉపయోగపడే మ్యాపును రూపొందించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అన్నట్టూ.. ఈ మ్యాపును తయారు చేసింది మన భారత సంతతి వ్యక్తే. యూనివర్సిటీ ఆఫ్ అయోవా ఆఫ్తాల్మాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ వినీత్ మహాజన్ మరో శాస్త్రవేత్తతో కలిసి  దీనిని ఆవిష్కరించారు. ఈ మ్యాపునకు సంబంధించిన పరిశోధన వివరాలు ‘జేఏఎంఏ ఆఫ్తాల్మాలజీ’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
 
 

>
మరిన్ని వార్తలు