చితికిన చిరుప్రాణాలు

4 Aug, 2014 00:31 IST|Sakshi
చితికిన చిరుప్రాణాలు

 కొత్తపల్లి :ఆ కుటుంబానికి ఓ కొత్త చిగురును కానుకగా ఇచ్చిన కాలం.. అంతలోనే ఆ మురిపాన్ని క్రూరంగా కాలరాసింది. అదే కుటుంబంలోని రెండు లేతరెమ్మలను తుంచేసింది. ఓ పచ్చిబాలింత ఒడిలో రెండువారాల పసికందుతో పాటు గుండెళ్లో  పుట్టెడు దుఃఖాన్ని మోయాల్సి వచ్చింది. ఉప్పాడ-కోనపాపపేట బీచ్‌రోడ్లో పొన్నాడ శివారు శీలంవారిపాలెం వద్ద ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒకరి తండ్రి గాయపడ్డాడు. మండలంలోని కోనపాపపేట, సామర్లకోట మండలం ఉండూరు శివారు ప్రకాశరావుపేటల్లో విషాదాన్ని నింపిన ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
 
 ప్రకాశరావుపేట కొత్తూరుకు చెందిన ఉప్పలపాటి సూరిబాబుకు, పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన చావ నపల్లి సత్యనారాయణ పెదకుమార్తె దేవికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి నందు (4) అనే కుమారుడు ఉన్నాడు. దేవి గత నెల 19న పుట్టింట్లో మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలను చూసేందుకు సూరిబాబు రెండు రోజుల క్రితం అత్తవారింటికి వెళ్లాడు. నందును వెంటబెట్టుకుని శనివారం ఉండూరు వచ్చాడు. ఆదివారం నందుతో మోటార్‌సైకిల్‌పై తిరిగి కోనపాపపేట  బయల్దేరాడు. పిన్నికి పుట్టిన బుల్లి తమ్ముణ్ని తానూ చూస్తానంటూ సూరిబాబు అన్న ఉప్పలపాటి సన్యాసిరావు కుమార్తె శివజ్యోతి (8) కూడా వారితో బయల్దేరింది.
 
 పొన్నాడ శివారు శీలంవారి పాలెం వద్ద సామర్లకోట నుంచి పెరుమాళ్లపురం ఊకలోడు కోసం ముందు వెళుతున్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పిన మోటార్‌సైకిల్ రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. లారీ వెనుక చక్రం కిందపడ్డ శివజ్యోతి, నందు అక్కడికక్కడే మరణించారు. సూరిబాబుకు స్వల్పంగా గాయాలయ్యాయి. కొత్తపల్లి ఏఎస్సై లోవరాజు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శనివారం వరకూ తమతో ఉన్న నందు..తండ్రి వెంట ఉండూరు వెళ్లకపోయినా ఈ గండాన్ని తప్పించుకునే వాడని, రెండో బిడ్డను ఇచ్చిన దేవుడు.. అంతలోనే తొలిబిడ్డను తీసుకుపోయాడని దేవి బావురుమంటోంది. అటు కోనపాపపేటలో, ఇటు ప్రకాశరావుపేట కొత్తూరులో ఆ రెండు కుటుంబాల బంధువులూ విషాదంలో మునిగారు.
 
 పసిబిడ్డను చూడాలని వెళ్లి దూరమయ్యావా బిడ్డా..!
 ఉండూరు (సామర్లకోట) : బతుకుతెరువుకు కూలి పనులు చేసుకుంటున్నా పిల్లలను మంచిగా చదివించాలనుకున్నామని, ఇంతలో ఇలా అయిందని శివజ్యోతి తల్లిదండ్రులు వరలక్ష్మి, సన్యాసిరావు కన్నీరుమున్నీరయ్యారు. పసిబిడ్డను చూడాలని వెళ్లిన తన బిడ్డ తనకు కాకుండా పోయిందని వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ రోదించింది. బుల్లి తమ్ముడిని చూడడానికి వెళుతున్నందుకు మురిసిపోయిన తన బిడ్డ ఆ ముచ్చట తీరకుండానే కడతేరిపోయిందని విలపించింది.
 

మరిన్ని వార్తలు