వినుడు వినుడు ఈ మర్కట గాథా..

10 Apr, 2016 20:16 IST|Sakshi
వినుడు వినుడు ఈ మర్కట గాథా..

బ్యాంకాక్: తిండికోసం ఓ ఇంట్లోదూరిన కోతి.. 25 ఏళ్లు అక్కడే బందీ అయిపోయింది! కోతుల బాధ భరించలేక, కోతులపై కోపం పెంచుకున్న ఓ ఇంటాయన ఆ కోతిని పట్టుకుని గాలిమాత్రమే చొరబడే బోనులో బంధించాడు. విలవిలలాడినా వదిలిపెట్టలేదు. వలవలా ఏడ్చినా కరుణించలేదు. పాతికేళ్ల సుదీర్ఘ శిక్ష అనంతరం పోయినవారమే ఆ కోతికి విముక్తి లభించింది. ఈ మర్కటపురాణం పూర్వాపరాల్లోకి వెళితే..

బ్యాంకాక్ మురికివాడలో నివసించే ఓ వ్యక్తి 1991లో ఓ కోతిని బంధించాడు. రెండు ఇళ్ల మధ్య ఉన్న చిన్న సందులో ఇనుపతీగలతో బోను తయారుచేసి అందులో కోతిని ఉంచాడు. గుర్తొచ్చినప్పుడు తినడానికి ఏదైనా ఇచ్చేవాడు. బుధ్ధిపుట్టినప్పుడు పండో ఫలమో ఇచ్చేవాడు. కాల క్రమంలో ఆ కోతి స్థానికులకు చేరువైంది. వాళ్లంతా ఆ కోతిని 'జోయ్' అని ముద్దుగా పిలిచేవారు.

కరుణించిన దానయ్య..
ఇదిలా ఉండగా దారినపోయే దానయ్య ఒకరు కోతి బోనులో ఉండటాన్ని చూసి చలించిపోయి, వైల్డ్ లైఫ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ వాళ్లకు సమాచారం చేరవేశాడు. ఆ సంస్థ సభ్యులు వెంటపెట్టుకొచ్చిమరీ కోతిని విడిపించాడు. విముక్తిపొందే సమయానికి కోతి చిక్కి శల్యమైపోయింది. శరీరంలో నీటి నిల్వలు బాగా తగ్గిపోవడంతో కనీసం నిలబడలేకపోయింది. 'జైలు లాంటి బోను నుంచి అది బయటపడి  వారం అవుతోంది. ఇప్పుడిప్పుడే మిగతా కోతులతో కలిసేప్రయత్నం చేస్తోంది' అంటూ కోతి బాగోగులను ఫేస్బుక్ ద్వారా వెల్లడింస్తున్నారు వైల్డ్ లైఫ్ సభ్యులు.

మరిన్ని వార్తలు