ఈ గేమ్ మీరెప్పుడైనా ట్రై చేశారా?

23 Jan, 2016 10:51 IST|Sakshi
ఈ గేమ్ మీరెప్పుడైనా ట్రై చేశారా?

అంతరిక్షంలో అమెరికా వ్యోమగామి స్కాట్ కెల్లీ ఖాళీ సమయంలో నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) లో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన కెల్లీ ఒకే విడతలో 300 రోజులు గడిపి రికార్డు బద్దలు కొట్టాడు. అక్కడ నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడిన వీడియోను ఆయన విడుదల చేశాడు. ఇలా ఆడటం సున్నా గ్రావిటీలో మాత్రమే సాధ్యమవుతుంది.

వాటర్ బాటిల్లోంచి నీటిని బయటకు పంపడంతోనే వెంటనే ఒక బాల్ ఆకారంలో మారింది. తన దగ్గరున్న రెండు బ్యాట్ల సాయంతో ఆ బంతి ఆకారంలో ఉన్న నీటి బుడగతో పింగ్ పాంగ్ ఆడాడు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. రెడిట్లో శనివారం భూమిమీద నుంచి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు.  

అరుదైన ప్రయోగం కోసం
స్కాట్ కెల్లీని అరుదైన పరిశోధన కోసం ఐఎస్ఎస్ పంపారు. అంతరిక్షంలో సుదీర్ఘ కాలం పనిచేస్తే.. మానవ శరీరం, మెదడుపై ఎలాంటి ప్రభావం పడుతుందో పరిశోధించే మిషన్ లో భాగంగా ఆయన ఐఎస్ఎస్ వెళ్ళాడు. అంతే కాదు.. ఈ ప్రయోగంలో స్కాట్ కెల్లీ తో పాటు.. అతని కవల సోదరుడు మార్క్ కెల్లీ కూడా పనిచేస్తున్నాడు.

స్కాట్ కెల్లీ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడపనుండగా.. అతని కవల సోదరుడిపై భూమి మీద నాసా కేంద్రంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అంతరిక్షం, భూమి మీద ఉన్న వ్యక్తులపై ఎలాంటి ప్రతికూల ప్రయోగాలు ఉంటాయో పరిశీలిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. వ్యోమగాములకు మరింత రక్షణ ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది.

 ఎక్కువ కాలం అంతరిక్షంలో గడపటం వల్ల శరీరం, మెదడు పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోవచ్చని నాసా తెలిపింది. అంతేకాదు.. మార్స్ పై నాసా చేస్తున్న ప్రయోగాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడింది. స్పేస్ స్టేషన్ లో ఉండే భార రహిత స్థితి, ఒంటరి తనం, రేడియేషన్, ఎక్కువ రోజులు అంతరిక్షంలో గడపాల్సి రావడం వంటి ప్రతికూల పరిస్థితులను శరీరం ఎలా తట్టుకుంటుందో అధ్యయనం చేస్తున్నట్లు వివరించింది. స్కాట్  మార్చి 3న భూమిపైకి తిరిగి రానున్నారు.