నాసా అంతరిక్ష గోధుమ పంట స్ఫూర్తితో..

3 Jan, 2018 10:58 IST|Sakshi

మెల్‌బోర్న్‌: అంతరిక్షంలో గోధుమలు పండించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ‘స్పీడ్‌ బ్రీడింగ్‌’ అనే ఈ పద్ధతి ద్వారా భూమిపై పంట దిగుబడిని సాధారణం కంటే మూడు రెట్లు పెంచడంతోపాటు పంట కోతకు వచ్చే సమయాన్ని కూడా 6 రెట్లు తగ్గించవచ్చని ప్రయోగ పూర్వకంగా నిరూపించారు. నాసా అంతరిక్షంలో గోధుమ పంట త్వరగా కోతకు వచ్చేందుకు పంటపై లైట్‌ ద్వారా నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేసింది. దీంతో పంట సాధారణం కంటే ముందుగానే కోతకు రావడంతోపాటు మరో పంటను వేసేందుకు వీలు కలుగుతుంది.

ఈ పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని భూమిపై ప్రత్యేకంగా రూపొందించిన గ్లాస్‌ హౌస్‌ల్లో గోధుమ, బార్లీ, ఆవాలు, శెనగ వంటి పంటలపై నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేశామని క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో లీ హిక్కీ తెలిపారు. చాలా ఆశ్చర్యకరంగా ఈ పద్ధతిలో ఏడాదిలో ఆరు సార్లు గోధుమ, శెనగ, బార్లీ, నాలుగు సార్లు ఆవాల పంటలను ఉత్పత్తి చేశామని లీ అన్నారు. ఇదే సాధారణ గ్లాస్‌ హౌస్‌ల్లో అయితే రెండు సార్లు, పొలాల్లో అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే పంట ఉత్పత్తి జరిగేదని వెల్లడించారు.

మరిన్ని వార్తలు