తొలి ‘వాణిజ్య యాత్ర’లో సునీతా

5 Aug, 2018 04:06 IST|Sakshi
సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాముల బృందంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఎంపికయ్యారు. మరో 8 మంది వ్యోమగాములతో కలసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బోయింగ్‌’ సంస్థ తయారుచేసిన బోయింగ్‌ సీఎస్‌టీ–100, స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రూపొందించిన డ్రాగన్‌ క్యాప్సూల్స్‌ ద్వారా ఈ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా పంపనుంది. 2011లో స్పేస్‌ షటిల్‌ కార్యక్రమం ముగిసిపోవడంతో అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేదు.

తమ సహకారంతో బోయింగ్, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని నాసా తెలిపింది. సునీతా, మరో వ్యోమగామి జోష్‌ కస్సాడాతో కలసి స్టార్‌ లైనర్‌ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని పేర్కొంది. గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా తిరిగి 2012లో భూమిపై అడుగుపెట్టారు. ఇక స్పేస్‌ ఎక్స్‌ డ్రాగన్‌క్యాప్సూల్‌ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్‌ బెహ్న్‌కెన్, డగ్లస్‌ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. అయితే, వీరి ప్రయాణం కంటే ముందుగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రెండు సంస్థలు తమ నౌకల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి.

మరిన్ని వార్తలు