నువ్వు చండాలంగా ఉన్నావ్‌

19 Aug, 2019 12:05 IST|Sakshi

వాషింగ్టన్‌: విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో తెగ వైరలవుతోంది. విమానాశ్రయ మహిళా సిబ్బంది ఒకరు ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించింది. ‘నువ్వు చాలా చండాలంగా ఉన్నావ్‌’ అంటూ కాగితం మీద రాసిచ్చింది. సదరు ఉద్యోగి ఇలా ఎందుకు చేసిందనే దాని గురించి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ సంఘటన ఈ ఏడాది జూన్‌లో చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని గ్రేటర్ రోచెస్టర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాలు.. స్ట్రాస్‌నర్‌ అనే ప్రయాణికుడు మెటల్‌ డిటెక్టర్‌లోంచి వెళ్తుండగా.. అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఓ మహిళా సిబ్బంది అతడి చేతికి ఓ చీటి ఇచ్చింది. అయితే స్ట్రాస్‌నర్‌ దీని గురించి పట్టించుకోకుండా బయటకు వెళ్లాడు. దాంతో సదరు మహిళ మీకిచ్చిన చీటిని చదివారా అని ప్రశ్నించింది. దాంతో స్ట్రాసనర్‌ దాన్ని తెరిచి చూడగా అందులో ‘నీవు చండాలంగా ఉన్నావ్‌’ అని రాసి ఉంది. ఆమె చర్యలకు బిత్తరపోవడం స్ట్రాస్‌నర్‌ వంతవ్వగా సదరు ఉద్యోగి మాత్రం ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించింది. ఉద్యోగి చర్యలతో ఆగ్రహించిన స్ట్రాస్‌నర్‌ ఆమె మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమే కాక ఆనాటి సంఘటనకు సంబంధించిన వీడియోను సంపాదించి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ఆమె ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని అని తెలపడమే కాక ఇలాంటి చర్యలను సహించమని.. సదరు ఉద్యోగినిని విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు