5.3 తీవ్రతతో భూకంపం.. అణుపరీక్షలు!

9 Sep, 2016 09:07 IST|Sakshi
5.3 తీవ్రతతో భూకంపం.. అణుపరీక్షలు!

సియోల్: ఉత్తర కొరియా మరోసారి అణుపరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉత్తర కొరియా ప్రధాన న్యూక్లియర్ సైట్ సమీపంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపాన్ని గుర్తించినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. ఖచ్చితంగా అది న్యూక్లియర్ టెస్ట్ మూలంగా సంభవించిన భూకంపంగా ఉత్తర కొరియా వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను అమెరికా, యూరప్ భూకంప పరిశీలన కేంద్రాలు సైతం గుర్తించాయి. ఉత్తర కొరియా ఫౌండేషన్ డే సందర్భంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఉత్తర కొరియా ఎలాంటి ప్రకటన చేయలేదు.

సాధారణ భూకంపం సమయంలోని ప్రకంపనల కంటే ఉత్తర కొరియాలోని ప్యుంగీ-రీ న్యూక్లియర్ టెస్ట్ సైట్ వద్ద శుక్రవారం ఏర్పడిన ప్రకంపనలు భిన్నంగా ఉన్నాయని జపాన్ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. జపాన్ రక్షణ శాఖ మంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. అణు పరీక్ష నిర్థారణ జరిగితే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ విషయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తామని వెల్లడించారు.

ఉత్తర కొరియా చర్యలను తమ సహచర దేశాలతో కలిసి పరిశీలిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఉత్తర కొరియా అణుపరీక్షలు జరపడం ఇది ఐదోసారి. ఇటీవల వరుస అణు పరీక్షలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలతో ఉత్తర కొరియా దూకుడును ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు