ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం

17 Nov, 2023 18:13 IST|Sakshi

ఫిలిప్పీన్స్‌ మరోసారి  భారీ భూకంపంతో కంపించి పోయింది.  శుక్రవారం దక్షిణ ఫిలిప్పిన్స్ మిందానో ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని జర్మనీ రిసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. అయితే, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం సునామీ వచ్చే అవకాశం లేదని, భూకంప నష్టంపై తక్షణ సమాచారం ఏదీ లేదని ప్రకటించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ సూచించింది.

తాను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బలమైన భూకంపం అని షియా లేరాన్  తెలిపారు. దీంతో జనం  భయాందోళనలతో  పరుగులు తీశారని చెప్పారు. భూకంప కేంద్రం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దావో సిటీలో జరిగే సమావేశానికి  ఆమె హాజరుకానున్నారు.  అలాగే  బలమైన భూకంపంతో గోడలు దెబ్బతిన్నాయని, కంప్యూటర్‌లు కింద పడిపోయాయని దక్షిణ కోటాబాటోలోని జనరల్ శాంటోస్ నగరానికి చెందిన రేడియో అనౌన్సర్ లెనీ అరనెగో  తెలిపారు. జనరల్ శాంటాస్ సిటీ విమానాశ్రయంలోని ప్రయాణికులను టార్మాక్‌కు తరలించారని భూకంపం సంభవించినప్పుడు విమాన ప్రయాణికుడు మైఖేల్ రికాఫోర్ట్  తెలిపారు. 

జపాన్ నుండి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న తీవ్రమైన భూకంప, అగ్నిపర్వత  కేంద్రం "రింగ్ ఆఫ్ ఫైర్" వెంబడి ఉన్న ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తూంటాయి. దీంతోపాటు  గత వారం పది రోజుల్లో పలు దేశాల్లో భూకంపాలు  సంభవించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు