ఉగ్ర సయీద్‌ ఆస్తులు పాక్‌ చేతికి!

2 Jan, 2018 02:33 IST|Sakshi

ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ ఆస్తులు, అతడి అధీనంలోని స్వచ్ఛంద సంస్థలను స్వాధీనం చేసుకోడానికి పాకిస్తాన్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. హఫీజ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న జమాత్‌–ఉద్‌–దవా (జేయూడీ), ఫలాహ్‌–ఎ–ఇన్‌సానియత్‌ ఫౌండేషన్‌ (ఎఫ్‌ఐ ఎఫ్‌)లను అధీనంలోకి తీసుకోవాలని ఐదు ప్రావిన్సులు, లా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ విభాగాలకు  ఆర్థిక శాఖ రహస్య ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. సంబంధించిన రహస్య పత్రాలను రాయిటర్స్‌ సంపాదించింది.

1987లో ఏర్పాటు చేసిన ఈ రెండు సంస్థలు లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద సంస్థలని, 2008 ముంబై మారణహోమం వెనుక హఫీజ్‌ హస్తముందని భారత్‌ ఆరోపిస్తోంది. హఫీజ్‌ ఆధ్వర్యంలో 300 పాఠశాలలు, ఆస్పత్రులు, ఓ ప్రచురణ సంస్థ, అంబులెన్స్‌ సర్వీసులు పని చేస్తున్నాయి. అలాగే జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌ సంస్థల్లో 50,000 వరకు వలంటీర్లు, వందల్లో పెయిడ్‌ వర్కర్లు పని చేస్తున్నారని ఉగ్రవాద నిరోధక సంస్థలు చెబుతున్నాయి. కాగా, హఫీజ్‌ సంస్థలను స్వాధీనం చేసుకుం టున్నట్లు వస్తున్న వార్తలపై పాక్‌ మంత్రి ఇక్బాల్‌ స్పందిస్తూ.. బాధ్యత గల దేశంగా నిషేధిత సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేస్తున్నామని, అమెరికా ఒత్తిడి మేరకు తాము చర్యలు తీసుకోవడం లేదని వెల్లడించారు.

విరాళాలపై నిషేధం
జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌లకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండా పాకిస్తాన్‌ ప్రభుత్వం సోమవారం నిషేధాజ్ఞలు జారీ చేసింది. జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌లతోపాటు సయీద్‌కు చెందిన మరికొన్ని సంస్థలకు ఎవరూ విరాళాలు ఇవ్వకుండదంటూ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ ఆఫ్‌ పాకిస్తాన్‌ (ఎస్‌ఈసీపీ) ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు