అమ్మా..నాన్న.. ఓ సెల్‌ఫోన్‌!

14 Jun, 2018 19:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూయార్క్‌ : తల్లిదండ్రులు.. మీరు సెల్‌ఫోన్‌కు దగ్గరవుతున్నారా?.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయాన్ని సెల్‌ఫోన్‌ వాడుతూ వృథా చేస్తున్నారా?..  అయితే మీ పిల్లలు మీకు దూరమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెద్దలు పిల్లలతో హాయిగా గడపాల్సిన సమయంలో సెల్‌ఫోన్‌ వాడుతూ ఉంటే పిల్లలలో భావోద్వేగాలు తగ్గిపోతాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా పిల్లలు క్రూరప్రవర్తన, చెడు ప్రవర్తనకు అలవాటుపడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ మిచిగాన్‌ శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన సర్వేల్లో ఈ విషయాలు తేటతెల్లమయ్యాయి.

ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ముఖాముఖి సంభాషణలు లేకపోవటాన్ని ‘టెక్నోఫెరెన్స్‌’ అని నామకరణం చేశారు. పిల్లల చెడు ప్రవర్తన నుంచి తప్పించుకోవాలని తల్లిదండ్రులు సెల్‌ఫోన్‌ను ఆశ్రయిస్తే అది వారిని మరింత నాశనం చేస్తుందంటున్నారు. రోజులో కొంత సమయాన్ని పిల్లల కోసం కేటాయించటం ద్వారా వారు తల్లిదండ్రులకు మరింత దగ్గరవుతారని, వారికి సంబంధించిన విషయాలలో శ్రద్ధ కనబరుస్తూ ఉండటం వల్ల మంచి ప్రవర్తన అలవడుతుందని అంటున్నారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సమస్యలు ఎక్కువవ్వటానికి గల ముఖ్య కారణం సెల్‌ఫోన్‌ వాడకమేనని పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు