48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు

27 Oct, 2023 04:22 IST|Sakshi

అమెజాన్‌ ఫెస్టివల్‌కు రికార్డు స్పందన  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత సీజన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (స్మార్ట్‌ఫోన్లు, టీవీలు) రంజిత్‌ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్‌ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్‌ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్‌ కనిపించగా, 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్‌ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, పెద్ద స్క్రీన్‌ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన అమెజాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎరీనా (ఏఎక్స్‌ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్‌లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్‌ బాబు వివరించారు.

మరిన్ని వార్తలు