'కాల్చిపారేయండి.. నేను చూసుకుంటా'

20 Apr, 2017 22:39 IST|Sakshi
'కాల్చిపారేయండి.. నేను చూసుకుంటా'

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

మనీలా: డ్రగ్స్‌ మాఫియాను ఏరిపారేస్తోన్న ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటర్టె మరో సంచలన నిర్ణయం తీసుకునేదిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలోని బొహాల్‌ ప్రావిన్సులో తీవ్రవాద నిరోధానికి పౌరుల చేతికి మారణాయుధాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఓ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘తీవ్రవాద నిర్మూలనకు పౌరులను సాయుధులను చేయాలని అనుకుంటున్నా.. నేను కూడా పౌరులతోనే నడుస్తా’  అని డ్యుటర్టె అన్నారు. ఉగ్రవాద అనుమానితులను చంపినా వారిని క్షమిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు.

‘మీరు ఉగ్రవాదులను చంపితే ఎలాంటి భయం అక్కర్లేదు, సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి వాస్తవం చెప్పండి. మీకెలాంటి ఇబ్బందులు రావు’  అంటూ భరోసా ఇవ్వడం గమనార్హం. పౌరులకు ఆయుధాలిచ్చే విషయమై డ్యుటర్టె స్థానిక ప్రభుత్వాలను సంప్రదించాలి అనుకుంటున్నారు. అయితే, అందుకు అవి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తొచ్చనే ప్రచారం జరుగుతోంది. పర్యాటక కేంద్రమైన బొహాల్‌లో గతవారం అబూ సయ్యాఫ్‌ తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు, ఒక జవాను, ఆరుగురు ఉగ్రవాదులు మరణించారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద అధ్యక్షుడు డ్యుటర్టె ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు