ప్లాస్టిక్ మహా సముద్రాలు

17 Feb, 2015 03:11 IST|Sakshi

మనం కొన్ని నిమిషాలు వాడి పారేసే క్యారీ బ్యాగులు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు భూమిలో కలిసిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? సుమారుగా వెయ్యి సంవత్సరాలు! భూమిపైనే కాదు.. సముద్రాల్లోనూ ప్లాస్టిక్ వేల ఏళ్లపాటు చెక్కుచెదరదు. అయితే, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇలాగే వదులుతూ పోతే.. భవిష్యత్తులో ఇక ప్లాస్టిక్ మహాసముద్రాలు అని పిలుచుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2010 నాటి గణాంకాల ప్రకారమే.. ఏటా దాదాపు 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. ఇదిలాగే సాగితే.. ఇక సముద్రాలన్నీ ప్లాస్టిక్‌మయమే! ఇటీవల ‘అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్’ సదస్సులో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్త డాక్టర్ జెన్నా జాంబెక్ బృందం ఈ మేరకు తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. వాటిలో కొన్ని

ఆసక్తికర సంగతులు...
సముద్ర ప్లాస్టిక్‌లో చైనా వదులుతున్న చెత్తే అధికం. మూడో వంతున అంటే..  ఏటా 35లక్షల మెట్రిక్‌టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చైనా నుంచే సముద్రాన్ని చేరుతున్నాయి.

ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక కూడా మొదటి వరుసలోనే ఉన్నాయి. మరో 20 వర్ధమాన దేశాలూ సముద్ర చెత్తకు కారణమవుతున్నాయి.

సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల్లో అమెరికా వాటా 1 శాతమే కావడం విశేషం. ఏటా 77 వేల టన్నుల ప్లాస్టిక్‌ను వదులుతున్న ఆ దేశం 20వ స్థానంలో ఉంది.

సముద్రాల్లోని ప్లాస్టిక్‌నంతా తీరప్రాంతాల్లో పరిస్తే.. ప్రతి అడుగు స్థలంలో ప్లాస్టిక్ చెత్తను నింపిన ఐదు క్యారీబ్యాగులను ఉంచాల్సి ఉంటుంది.

ఇంగ్లాండ్‌లోనే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 150 క్యారీబ్యాగులను వాడి పారేస్తున్నారు.

చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి ఏటా 15.5 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ సముద్రాలను ముంచెత్తుతుంది. అప్పుడు ప్రతి అడుగు తీరప్రాంతంలో వంద క్యారీబ్యాగులను పేర్చినంత చెత్త పోగవుతుంది.

ప్లాస్టిక్ వ్యర్థాలు తిని సముద్రపక్షులు, చేపలు, తాబేళ్లు సహా 690 జాతులకు చెందిన లక్షలాది జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ తిన్న సముద్ర చేపల్ని తినడం వల్ల మనుషులూ అనారోగ్యం బారినపడుతున్నారు.

 చైనా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంకలే 50 శాతం సముద్ర ప్లాస్టిక్ చెత్తకు కారణమవుతున్నాయి. ఈ ఐదు దేశాలూ సరైన మౌలిక వసతులు ఏర్పాటుచేసుకుని, ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థంగా నిర్వహిస్తే సమస్య మూడో వంతు వరకూ పరిష్కారమైపోతుంది.
 - సెంట్రల్ డెస్క్

మరిన్ని వార్తలు