శుభవార్త ;అందుబాటులోకి యాంటీబయాటిక్‌

22 Feb, 2020 08:05 IST|Sakshi

శుభవార్త

ఇటీవల చాలాకాలం నుంచి మనకు సరికొత్త యాంటీబయాటిక్స్‌ ఏవీ లభ్యం కాకపోవడం మానవాళిని ఆందోళనలో ముంచెత్తుతోంది. అలాంటి దుస్థితిని తొలగించేందుకు ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’(ఎమ్‌ఐటీ) పరిశోధకులు నడుంకట్టారు. అక్కడి ఫలితాలూ ఆశాజనకంగానూ ఉన్నాయి. అతి త్వరలోనే మానవాళికి ‘హాలిసిన్‌’ పేరుతో ఓ సరికొత్త యాంటీబయాటిక్‌ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు అక్కడి పరిశోధనల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడేస్తూ ఉండటం మన అలవాటు. ఆన్‌ కౌంటర్‌ మెడిసిన్స్‌గా అమ్ముడయ్యే వాటిల్లో యాంటీబయాటిక్సే ఎక్కువ. దాంతో గతంలో చిన్న యాంటీబయాటిక్‌ వేస్తే తగ్గిపోయే వ్యాధులు కూడా మొండికేయడం మొదలుపెట్టాయి.

మనం తేలిగ్గా తుదముట్టించగల వ్యాధిక్రిములూ తమ శక్తిని విపరీతంగా పెంచుకుంటూ పోయి‘ సూపర్‌బగ్స్‌’గా మారిపోతూ మానవాళిని బెంబేలెత్తించాయి. ఒకప్పుడు యాంటీబయాటిక్స్‌కు తేలిగ్గానే  లొంగిపోయే ట్యూబర్క్యులోసిస్‌ (టీబీ) వంటి  వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు... తమ నిరోధకశక్తిని పెంచుకొని రెసిస్టెంట్‌ వెరైటీ టీబీని కలిగిస్తూ సూపర్‌బగ్స్‌గా రూపొందాయి. దాంతో ప్రస్తుతం లభ్యమవుతున్న యాంటీబయాటిక్‌ మందులను డబుల్‌డోస్‌ ఇచ్చినా ఆ సూపర్‌బగ్స్‌ను నిర్మూలించలేకపోతున్నాం. ఇలాంటి దుస్ధితి వల్ల మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు వస్తాయేమోనని అటు వైజ్ఞానికులూ, ఇటు వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్న ప్రస్తుత తరుణంలో అలాంటి సూపర్‌బగ్స్‌ను తుదముట్టించే యాంటీబయాటిక్‌కు మసాచుసెట్స్‌ ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఓ భరోసా లభించింది. హాలిసిన్‌ అనే పేరుతో రాబోతున్న ఈ సరికొత్త యాంటీబయాటిక్‌ ఔషధం కోసం ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తోందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా