థ్యాంక్స్‌  గ్రెటా.. ముఖంపై గుద్దినట్లు చెప్పావ్‌ : ప్రియాంక

24 Sep, 2019 17:29 IST|Sakshi

న్యూఢిల్లీ : వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాధినేతలను నిలదీసిన 16 ఏళ్ల బాలిక గ్రెటా థంబర్గ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ దేశాధినేతను ఉద్దేశించి ‘పర్యావరణం నాశనమైపోతోంది. ప్రజలు చనిపోతున్నారు. కానీ మీకు ఇవేమీ పట్టవు. డబ్బు, వృద్ధి అంటూ కథలు చెప్తారు. మా తరాన్నిమీరు మోసం చేయడానికి మీకెంత ధైర్యం(హౌ డేర్‌ యూ). మేం మిమ్మల్ని క్షమించబోం’ అంటూ బాలిక చేసిన ప్రసంగంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సైతం గ్రెటా ప్రంసంగాన్ని కొనియాడారు. తాజాగా బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా సైతం గ్రెటా థంబర్గ్‌ ప్రసంగంపై స్పందించారు. ‘థ్యాంక్స్‌ గ్రెటా థంబర్గ్‌.. మీ తరాన్ని ఒక చోటకు తెచ్చి పర్యావరణ రక్షణపై మా తరానికి ముఖంపై గుద్దినట్లు చెప్పినందుకు. అలాగే పర్యావరణ మార్పుపై మేం ఇంకా బాగా తెలసుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినందుకు అభినందనలు. మీమ్మల్ని ఓడించడానికి మాకెంత ధైర్యం?  మనం బతకడానికి చివరకు మనకు ఈ ఒక్క గ్రహం మాత్రమే ఉంది’  అంటూ హౌ డేర్‌ యూ(How Dare You)అనే హాష్‌ ట్యాగ్‌ను జోడించి ట్విట్‌ చేసింది.

(చదవండి : హౌ డేర్‌ యూ... అని ప్రపంచ నేతలను నిలదీసింది!)

కాగా, ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సులో  స్వీడన్‌కు చెందిన గ్రెటా థంబర్గ్‌ ప్రసంగిస్తూ.. ‘ మీ(ప్రపంచ దేశాధినేతలు) భూటకపు మాటలతో చిన్నప్పటి నుంచి నేను కన్న కలలను నాశనం చేశారు. భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. పర్యావరణ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. ప్రజలు చనిపోతున్నారు. ప్రస్తుతం పర్యావరణం అంతరించిపోయే మొదటి దశలో మనం ఉన్నాం. మీరు మాత్రం ఆర్థిక అభివృద్ధంటూ, డబ్బంటూ కట్టుకథలు అల్లుతున్నారు. మీకెంత ధైర్యం? గడిచిన 30 ఏళ్లలో ఈ సూచనలు​ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మా సమస్యలను వింటున్నామని మీరు చెబుతున్నారు. ఒకవేళ మీరు నిజంగా పరిస్థితిని అర్థం చేసుకొని ఉంటే సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యేవారు కాదు. అందుకే మిమ్మల్ని నేను నమ్మలేను. ప్రకృతికి హాని కలిగించే​ వాయువులను నివారించడంలో విఫలమై... నూతన తరానికి ఆరోగ్యకర వాతావరణాన్ని అందించకుండా ఉండేందుకు ఎంత ధైర్యం? యువత మిమ్మల్ని గమనిస్తోంది. ఇప్పుడు మీరు నవ్వుకున్నా... త్వరలోనే మా వేదన ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది’ అని గ్రెటా థంబర్గ్‌ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు