భార్యను పొడిచి జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు!

1 Sep, 2016 14:23 IST|Sakshi
నవీన్‌కుమార్ పటేల్

హూస్టన్: భార్యపై హత్యాయత్నం చేసిన భారత అమెరికన్ జైలు శిక్ష నుంచి మినహాయింపు పొందిన అరుదైన సంఘటన ఇది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలే ఆయన్ను కాపాడాయి. కాన్‌కాస్ నివాసి నవీన్‌కుమార్ పటేల్(46) భార్య పప్పు తృణ ధాన్యాలు తిన్నదని తను నడుపుతున్న హోటల్‌లోనే చిన్న కత్తితో పొత్తి కడుపులో రెండు సార్లు పొడిచాడు. ఆమె లావుగా ఉన్నందునే అలా చేశానని పోలీసుల వద్ద అంగీకరించాడు.

హిందూ సంస్కృతి ప్రకారం... భర్తను అరెస్టు చేస్తే అతని భార్య, పిల్లలను పటేల్ వర్గం బహిష్కరిస్తుందని అతని తరపు లాయర్ జాన్ కెర్న్స్ డగ్లస్ కౌంటీ జడ్జి రాబర్ట్ ఫేర్‌చైల్డ్‌కి విన్నవించారు. హిందూ సంప్రదాయాలు అతనికి శిక్ష విధించడంలో అడ్డంకిగా మారాయని జడ్జి అన్నారు. ప్రస్తుతానికి పటేల్‌కు ప్రొబేషన్ విధించారు. నేరాలకు తిరిగి పాల్పడకుండా నిరోధించే ప్రణాళికలు తయారుచేసే వరకు తాత్కాలికంగా జైలుకు పంపారు.

పటేల్ మద్యానికి బానిసై ‘బైపోలార్ డిసార్డర్’ అనే రుగ్మత వల్లే ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన్ను పరీక్షించిన వైద్యుడు చెప్పారు. తాగడం మాని వైద్యాన్ని కొనసాగిస్తే నేరాలకు పాల్పడే అవకాశం తగ్గుతుందని సూచించారు. విచారణ సమయంలో భార్యతో పాటు కుటుంబ సభ్యులు పటేల్‌కు మద్దతుగా నిలిచారు. తేలికపాటి శిక్ష విధించాలని జడ్జికి ఉత్తరాలు కూడా అందాయి. ఇకపై పటేల్ తాగకుండా జాగ్రత్తపడతామని కుటుంబ సభ్యులు జడ్జికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు