మొసళ్ల బోనులో ఫోటోలు దిగి చిక్కులు

24 Oct, 2017 12:33 IST|Sakshi

క్వీన్స్ లాండ్ : ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే అటువైపుగా వెళ్లేందుకు దాదాపుగా ఎవరూ సాహసించరు. కానీ, ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఇలాంటి వెకిలి వేషాలు వేస్తే మూర్ఖులు కాక ఏమంటారు చెప్పండి. 

క్వీన్స్ లాండ్‌లోని పోర్ట్ డగ్లస్ మెరీనా దగ్గర రెండు వారాల క్రితం వృద్ధురాలు మొసలి బారిన పడి చనిపోయింది. ఆ సరస్సులో మొసళ్ల బారిన పడి చాలా మంది గాయపడుతున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోకపోవటంతో ఆ ఘోరం జరిగింది. అయితే ఆ తర్వాత వాటిని పట్టుకునేందుకు అక్కడక్కడా ఉచ్చులను(బోనులను) ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న నలుగురు యువకులు ఆ సరస్సులోకి దిగి సుమారు గంటకు పైగా గడిపారు. అక్కడే ఉన్న ఓ బోనులో కూర్చుని ఫోటోలు దిగారు. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన వాళ్లు.. ఆ ఫోటోలను తమ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 

దీంతో సోషల్ మీడియాలో వారి వేషాలపై విమర్శలు గుప్పించారు. వారు ఫోటోలు దిగిన ప్రాంతానికి 4 మీటర్ల దూరంలోనే మొసలి ఇంతకు ముందు వృద్ధురాలిని చంపటం విశేషం. ఘటనపై డగ్లస్‌ షైర్‌ మేయర్ జూలీ ల్యూ స్పందిస్తూ...  వారు సరదాగా చేసిన ఆ యత్నం చాలా చెండాలంగా ఉంది. ప్రాణాలతో చెలగాటం సాహసమని వారి భావించి ఉండొచ్చు. కానీ, వారి చేసిన పని మూర్ఖపు చర్యే. వారిని వదిలే ప్రసక్తేలేదు. చర్యలు తీసుకుని తీరతాం అని అన్నారు. 

నిబంధనల అతిక్రమించి నీటిలో దిగి బోను దగ్గరికి వెళ్లినందుకుగానూ వారికి 15 వేల డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఫోటోను ముందుగా పోస్ట్ చేసిన స్టేసీ డబ్ల్యూ క్లేటన్ అనే యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇడియట్స్ ఆఫ్ ది సెంచరీ యాష్ ట్యాగ్ తో ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు