నల్ల సముద్రంలో కూలిన విమానం

26 Dec, 2016 02:18 IST|Sakshi
నల్ల సముద్రంలో కూలిన విమానం

92 మంది మృతి.. 10 మృతదేహాలు వెలికితీత
సోచీ నుంచి సిరియాకు వెళుతున్న రష్యా మిలటరీ విమానం
బయలుదేరిన రెండు నిమిషాలకే ప్రమాదం
విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు పుతిన్‌.. ఉగ్ర కోణాన్ని తిరస్కరించిన రష్యా
మృతుల్లో 64 మంది సంగీత బృందం, 9 మంది జర్నలిస్టులు


మాస్కో: రష్యా మిలటరీ విమానం ఆదివారం ఉదయం నల్ల సముద్రంలో కుప్పకూలిపోయింది. సిరియాకు బయలు దేరిన టీయూ–154 విమా నంలో 92 మంది ప్రయాణిస్తున్నారు. దక్షిణ రష్యాలోని సోచీ పట్టణం నుంచి బయలుదేరిన రెండు నిమిషాలకే విమానం అదృశ్యమైందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఐగోర్‌ కొనషెన్‌కోవ్‌ చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 7:55 నిమిషాల తర్వాత రాడార్‌కు సిగ్నల్స్‌ అందకుండాపో యాయని ఆయన తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలేంటి అనేది ఆయన వెల్లడించలేదు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో పరిస్థిని బట్టి విమానంలో ఉన్న వారు ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రదాడి అయి ఉండొచ్చని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ఈ వాదనను రష్యా అధికారులు తోసిపుచ్చుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే సహాయక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. వీరికి కొద్ది సేవటికే దుర్ఘటన ప్రాంతంలో 10 మృతదేహాలు లభించాయి. సోచీ తీరానికి 1.5 కి.మీ దూరంలో 50 నుంచి 70 మీటర్ల లోతులో విమాన శకలాలను గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ను ఆదేశించారు. ఒక రోజు సంతాప దినం ప్రకటించిన పుతిన్‌.. ప్రమాద కారణాలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు.

ఎక్కువ మంది సంగీత బృందం
ప్రమాదానికి గురైన విమానం పశ్చిమ సిరియాలోని లటాకియా ప్రావిన్స్‌లోని హెమీమిమ్‌ ఎయిర్‌బేస్, రష్యా మధ్య నిరంతరం రాకపోకలు సాగిస్తుంది. ఆ ఎయిర్‌బేస్‌లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి పెద్ద ఎత్తున సంగీత బృందాన్ని తీసుకెళుతున్నారు. విమానం కూలిపోయిన సమయంలో దానిలో 84 మంది ప్రయాణికులతో పాటు 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో రష్యా మిలిటరీకి చెందిన అధికారిక సంగీత బృందం అలెగ్జాండ్రోవ్‌ ఎన్‌సెంబుల్‌ సభ్యులు 64 మంది ఉన్నారు.

ఈ బృందాన్ని రెడ్‌ ఆర్మీ కోయిర్‌ అని కూడా పిలుస్తారు. మిగిలిన ప్రయాణికుల్లో 9 మంది జర్నలిస్టులు, ఓ డాక్టర్, సర్వీస్‌మెన్‌ ఉన్నారు. 1983లో ఈ విమానం సేవలు ప్రారంభమయ్యాయని, 2014లో మరమ్మతులు చేశామని కొనషెన్‌కోవ్‌ తెలిపారు. ఉగ్రదాడి జరిగిఉండొచ్చు అన్న వాదనను రక్షణ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు విక్టర్‌ ఒజెరోవ్‌ ఖండించారు. సాంకేతిక లోపం వల్లో, సిబ్బంది తప్పిదం వల్లో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన ఆయన తెలిపారు.

మోదీ సంతాపం  
రష్యా సైనిక విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్‌ ద్వారా సంతాపం తెలిపారు. ‘ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల మృతికి రష్యాతో పాటు భారత్‌ కూడా సంతాపం తెలుపుతోంది’అని మోదీ ట్వీట్‌ చేశారు.

                               విమాన శకలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న సహాయక సిబ్బంది

మరిన్ని వార్తలు