గుర్గావ్‌లో ఏం జరుగుతోంది?

11 Sep, 2017 11:30 IST|Sakshi
గుర్గావ్‌లో ఏం జరుగుతోంది?

గుర్గావ్‌ : సంచలనం రేపిన హర్యానాలోని స్కూల్‌లో బాలుడి హత్య కేసు అటు పోలీసు అధికారులను పరుగులు పెట్టించడంతోపాటు స్కూల్‌ యజమాన్యానికి చుక్కలు చూపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బస్సు కండక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా స్కూల్‌ పరిపాలన విభాగానికి చెందిన అధికారులను కూడా అరెస్టు చేసింది. గత రాత్రి అరెస్టు చేసిన వారిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోపక్క, ఈ స్కూల్‌ గుర్తింపు విషయంపై విద్యాశాఖ మంత్రి రామ్‌ బిలాస్‌ శర్మ స్పందిస్తూ ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ నిర్లక్ష్యం చేసిందని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే, 1200మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్‌ గుర్తింపును రద్దు చేయలేమని తెలిపారు.

ఈ కేసును సీబీఐ అధికారులకు అప్పగించాలంటూ పెద్ద మొత్తంలో స్కూల్‌ ముందు ధర్నాకు దిగిన వారిలో దాదాపు 50మందిపై లాఠీ చార్జీ చేసి గాయపరిచిన అరుణ్‌ అనే సీఐని కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. స్కూల్‌లో చాలా లోపాలున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనంటూ బాలుడి తండ్రి డిమాండ్‌ చేయడంతోపాటు నేడు వారు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

స్థానిక పోలీసుల విచారణతో తాము సంతృప్తిగా లేమని, వారు ఏదో కుట్రలు చేస్తున్నారని, నిజనిజాలు లోకానికి తెలిసేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటున్నామని చెప్పారు. వీరి తరుపు న్యాయవాది కూడా అత్యవసర వాదనల పేరిట సుప్రీం బెంచ్‌ ముందుకు పిల్‌ను తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ కేసు మీద పద్నాలుగు టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఒక టీం ముంబయిలోని స్కూల్‌ యజమాన్యం వద్దకు వెళ్లింది. స్కూల్‌ సీఈవో ర్యాన్‌ పింటోను పోలీసులు ప్రశ్నించనున్నారు.

మరిన్ని వార్తలు