బ్రిటన్‌ పార్లమెంటులో వేధింపులు!

17 Oct, 2018 01:03 IST|Sakshi

బయటపెట్టిన విచారణ నివేదిక  

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటులో లైంగిక హింస, బెదిరించడం, విసిగించడం వంటి వేధింపులు ఉన్నాయనీ, వాటిని భరించి, దాచేసే ఇబ్బందికర సంస్కృతి అక్కడ చాలా ఏళ్లుగా కొనసాగుతోందని తాజాగా ఓ విచారణలో తేలింది. ఎంపీలపై వరుస వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ ఏడాది మొదట్లో బ్రిటన్‌ పార్లమెంటు దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ నాయకురాలు ఆండ్రియా లీడ్సమ్‌ విచారణకు ఆదేశించారు. విశ్రాంత న్యాయమూర్తి డేమ్‌ లారా కాక్స్‌ విచారణ జరిపి రూపొందించిన నివేదిక సోమవారం విడుదలైంది. పార్లమెంటులో ౖసైతం వేధింపులను అడ్డుకట్ట వేయగల సమర్ధ యంత్రాంగం లేకపోవడాన్ని ఈ నివేదిక ఎత్తిచూపింది.

200 మందికి పైగా బాధితులు తాము అనుభవించిన హింసను/ వేధింపులను కాక్స్‌ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత /మాజీ ఎంపీలు మహిళా సిబ్బందిపై సాగించిన లైంగిక వేధింపుల ఘటనలు నివేదిక ద్వారా వెల్లడయ్యాయి.  రూపురేఖలు – వస్త్రధారణపై వ్యాఖ్యానించడం, ఎగతాళి చేయడం, ఇతరుల ముందు అవమానించడం, నడుం చుట్టూ చేతులేయడం, మోకాళ్ల మీద మరింతసేపు చేతులేసి ఉంచడం, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించడం, వక్ష భాగాన్నీ, చేతుల్నీ అసభ్యకర రీతిలో తాకడం, ఆశించిన విధంగా పని చేయని మహిళలపై బూతు పదాలు ప్రయోగించడం సహా ఎన్నో రకాలుగా వేధింపులు సాగాయని ఆమె పేర్కొన్నారు.

విచారణ నిబంధనల మేరకు కాక్స్‌ వ్యక్తుల పేర్లు బయటపెట్టలేదు. ‘కొందరి దురహంకార ప్రవర్తనను కప్పి ఉంచే సంస్కృతి పార్లమెంటులో ఉంది’ అని నివేదికలో లారా పేర్కొన్నారు. సీనియర్‌ క్కర్లుల నుంచి కూడా మహిళలకు వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. ఉద్యోగులను హింసించడం, రకరకాలుగా వేధించడం, బాధితులకు మద్దతు లభించే వాతావరణం లేకపోవడం, వేధింపుల వ్యవహారాలను కావాలనే కప్పిపెట్టడం, ఫిర్యాదు చేసిన వారికి కనీస రక్షణ లేకపోవడం, వారి పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించక పోవడం దిగువసభలో సర్వసాధారణమైపోయిందని నివేదికలో కాక్స్‌ స్పష్టం చేశారు.

హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు పదవుల నుంచి దిగిపోయే వరకు ఇక్కడ మార్పు రాదని బాధితులు చెప్పినట్లు లారా తెలిపారు. ‘విచారణ సమయంలో కొందరు తెలిపిన అభిప్రాయాల ప్రకారం.. ఇక్కడ సమూల మార్పు సాధ్యమన్న నమ్మకాన్ని బాధితుల్లో కలిగించడం కూడా చాలా కష్టం’ అని 155 పేజీల తన నివేదికలో కాక్స్‌ వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు