ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌కు ఆమోదం

27 Jun, 2018 00:58 IST|Sakshi

5–4 తేడాతో సమర్థించిన అమెరికా సుప్రీంకోర్టు

ఈ తీర్పు అద్భుతం: ట్రంప్‌

వాషింగ్టన్‌: వివాదాస్పద ట్రావెల్‌ బ్యాన్‌ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ ఊరట లభించింది. పలు ముస్లిం దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ గతేడాది తీసుకొచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఆ దేశ సుప్రీం కోర్టు సమర్థి స్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. ముస్లింల పట్ల వివక్ష చూపుతున్న ఈ ఉత్తర్వును రద్దు చేయాలన్న పిటిషన్‌ను 5–4 తేడాతో తోసిపుచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జాన్‌ రాబర్ట్స్‌తో సహా మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు ట్రంప్‌ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పునివ్వగా.. మరో నలుగురు వ్యతిరేకించారు. వలసల్ని నియంత్రించేందుకు అధ్యక్షుడికి తగిన అధికారముందని తీర్పులో జస్టిస్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నారు. అయితే వలసలు, మరీ ముఖ్యంగా ముస్లింలపై ట్రంప్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలపై మాత్రం కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

జస్టిస్‌ సోనియా సోటోమేయర్‌ భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ట్రంప్‌ ప్రకటన ముస్లిం వ్యతిరేక ఉద్దేశంతోనే చేసిందని నిర్ధారణకు రావచ్చని చెప్పారు. న్యాయమూర్తులు స్టీఫెన్‌ బ్రేయర్, రూత్‌ గిన్స్‌బర్గ్, ఎలేనా కగన్‌లు కూడా ట్రంప్‌ ఉత్తర్వుల్ని వ్యతిరేకించారు. గత సెప్టెంబర్‌లో చాడ్, ఇరాన్, ఇరాక్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమెన్‌ పౌరుల రాకపై అమెరికా నిషేధం విధించింది. అనంతరం జాబితా నుంచి చాడ్, ఇరాక్‌లను తొలగించింది. ట్రంప్‌ నిర్ణయంపై డెమొక్రాట్లు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ దేశాల్లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు కింది కోర్టుల్ని ఆశ్రయించగా.. ట్రంప్‌ ఉత్తర్వులపై అవి స్టే విధించాయి.  

రాజ్యాంగం సాధించిన విజయం: ట్రంప్‌
తీర్పు అనంతరం ట్రంప్‌ స్పందిస్తూ.. ‘ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది.. అద్భుతం. ఇది అమెరికా ప్రజలు, రాజ్యాంగం సాధించిన ఘన విజయం. నేను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం.. దేశ సమగ్రత, భద్రతను కాపాడుతాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు