అదృశ్యమైన వందేళ్లకు వెపన్స్‌తో దొరికింది!!

22 Jan, 2016 19:21 IST|Sakshi
అదృశ్యమైన వందేళ్లకు వెపన్స్‌తో దొరికింది!!

సముద్రంలో మునిగిపోయిన ఓ ఓడను ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వందేళ్ల తర్వాత గుర్తించారు. ఆ సబ్ మెరైన్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా గుర్తించే స్థితిలో ఉండటం గమనార్హం. అందులోని ఆయుధాలు పాక్షికంగానే ధ్వంసమయ్యాయి. అయితే అప్పటి ఆయుధాలను ఇప్పుడు వాడటం కుదకరపోవచ్చునని ఈ ఓడను వెలుగులోకి తెచ్చిన స్కాట్లాండ్ పునరుత్పాదక ఇంధన సంస్థ తెలిపింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు ఈ పెద్ద ఓడలో ప్రయాణించారు.

ఇందులోని ప్రయాణించిన వారంతా చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈస్ట్ ఆంగ్లియన్ తీరానికి 55 మైళ్ల దూరంలో నీటి కింద సుమారు వంద అడుగుల లోతులో ఉన్న ఈ 'యూ-బోట్' భాగాలను స్కాట్లాండ్ కు చెందిన సర్వే కంపెనీ బృందం గుర్తించారు. ఈ షిప్పును పేల్చివేయడంతో మునిగిపోయి ఉండొచ్చునని, 1915లో తొలి ప్రపంచ యుద్ధంలో భాగంగా ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

గ్రేటర్ లండన్ కంటే నాలుగు రెట్ల అధిక వైశాల్యం ఉన్న సముద్రజలాల్లో సుమారు రెండు సంవత్సరాల పాటు అన్వేషించి ఈ షిప్పును గుర్తించారు. మొదటగా దీనిని 1940, జూన్లో అదృశ్యమైన డచ్ మిలిటరీ సబ్ మెరైన్ అని భావించారు. చివరికి జర్మనీ సబ్ మెరైన్ 'యూ-31' అని నిర్ధారించుకున్నారు. జనవరి 13, 1915న జర్మనీ తూర్పు తీరంలో గస్తీకి వెళ్లిన ఈ నౌక మళ్లీ కనిపించలేదు. ఈ ఓడ శకలాలను గుర్తించడం నిజంగా చాలా ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని రేకెత్తించిందని స్కాట్లాండ్ పవర్ గ్రూపు ప్రాజెక్టు డైరెక్టర్ చార్లీ జార్డాన్ తెలిపారు.

మరిన్ని వార్తలు