కార్బన్‌ డయాక్సైడ్‌తో వరికి ముప్పు.. 

26 May, 2018 04:27 IST|Sakshi

టోక్యో: మానవాళి మనుగడకు అవసరమైన ఆహార వనరుల్లో వరి ప్రధానమైంది. ఐరన్, జింక్, ప్రొటీన్‌లతోపాటు బీ1, బీ2, బీ5, బీ9 లాంటి విటమిన్లు వరిలో పుష్కలంగా దొరుకుతాయి. అయితే ఇది ఇప్పటి మాట.. రాబోయే రోజుల్లో వరిలో ఉండే ఈ పోషకాల శాతం క్రమంగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికంతటికి మానవుడి చేతల కారణంగా వాతావరణంలో విపరీతంగా పెరిగిపోతున్న కార్బన్‌ డయాక్సైడ్‌ అని వారు చెబుతు న్నారు. వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయిలు పెరుగుతున్న కొద్దీ వరిలో పోషక విలువలు పడిపోతుంటాయని తాజా అధ్యయనంలో టోక్యో వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.

కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువుల మధ్యనే ఈ శతాబ్దపు రెండో భాగంలో వరి ఎక్కువగా పండుతుందని, దీంతో వరిలో పోషక విలువలు తగ్గిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. తక్కువ ధరకు దొరికే వరి లాంటి అధిక పోషక విలువలు ఉన్న పంట గనుక ఇలా ప్రమాదంలో పడితే.. వరి ప్రధాన ఆహార వనరుగా ఉన్న దేశాల్లో పోషకాహారలోపం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరిలోని అన్ని రకాలకు ఈ విధంగానే జరుగుతుందని ఇప్పుడే చెప్పలేమని.. దీనిపై మరింత పరిశోధనలు చేయాల్సి ఉందని అంటున్నారు.   

మరిన్ని వార్తలు