అమెరికాలో ట్రిపుల్ మర్డర్ సంచలనం

12 Feb, 2015 16:25 IST|Sakshi
అమెరికాలో ట్రిపుల్ మర్డర్ సంచలనం

అమెరికాలోని ఉత్తర కరొలినా ప్రాంతంలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ఓ వ్యక్తి కాల్చిచంపాడు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మరణించిన ముగ్గురూ ఒకే మైనారిటీ వర్గానికి చెందినవాళ్లు కావడంతో నిరసన స్వరాలు మిన్నంటుతున్నాయి. డీ షాడీ బరాకత్ (23), అతడి భార్య యూసర్ మహ్మద్ అబూ సల్హా (21)లతో పాటు రజాన్ మహ్మద్ అబూ సల్హా (19) ఈ కాల్పుల్లో మరణించారు. చాపెల్ హిల్ ప్రాంతంలోని సమ్మర్ వాక్ సర్కిల్లో అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.11 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మొత్తం ముగ్గురినీ తలలోనే కాల్చి చంపారు. ఈ ఘటనలో అనుమానితుడైన క్రెయిగ్ స్టీఫెన్ హిక్స్ (46)ను పోలీసులు అరెస్టుచేశారు. కాగా.. నేరానికి పాల్పడినట్లు భావిస్తున్న హిక్స్ తనను తాను హేతువాదిగా ఫేస్బుక్లో పేర్కొన్నాడు. అన్ని మతాలకు సంబంధించిన విశ్వాసాలను ఖండిస్తూ ఫొటోలు, వ్యాఖ్యలు పెట్టాడు.

వాహనాల పార్కింగు విషయంలో ఇరుగుపొరుగుల మధ్య జరిగిన వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. మృతురాలి తండ్రి మాత్రం మతపరమైన విద్వేషంతోనే ఈ హత్యలు చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇది విద్వేషంతో కూడిన హత్యేనని అన్నారు. ఇంతకుముందు కూడా హిక్స్ పలుమార్లు తన కూతురిని, అల్లుడిని వేధించాడని ఆయన చెప్పారు. అతడితో ఇబ్బంది ఉన్నట్లు చెప్పినా, ఇంతదూరం వెళ్తాడని మాత్రం అనుకోలేదన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ హత్యలపై తీవ్రంగా స్పందించారు. కొంతమంది దీన్ని ప్యారిస్ నగరంలోని చార్లీ హెబ్డో పత్రికపై జరిగిన దాడితో పోలిస్తే, మరికొందరు బరాక్ ఒబామా, ఇతర ప్రముఖులు ఈ దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు