గడువు తీరిందా.. వెనక్కి పంపేస్తారు

28 Sep, 2018 02:57 IST|Sakshi

వలసదారులను తిప్పిపంపేందుకు సిద్ధమైన అమెరికా

అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన అమలు

భారతీయులపై అధిక ప్రభావం

వాషింగ్టన్‌: అమెరికాలో చట్టబద్ధంగా నివసించేందుకు గడువుతీరిన వలసదారులను వెనక్కి పంపేందుకు రంగం సిద్ధమైంది. వీసా పొడిగింపునకు, మార్పులు చేసుకునేందుకు పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిని స్వదేశాలకు పంపే ప్రక్రియ అక్టోబర్‌ 1(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. అయితే హెచ్‌–1బీ వీసాదారులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉపాధి, శరణార్థులకు సంబంధించిన పిటిషన్‌లకు ఇప్పట్లో ఈ విధానాన్ని అమలు చేయబోవట్లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్‌సీఐఎస్‌) స్పష్టతనిచ్చింది.

తాజా నిర్ణయంతో అమెరికాలో ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్న భారతీయులపైనే అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. కొత్తగా అమల్లోకి వస్తున్న నిబంధన ప్రకారం.. వీసా గడువు పొడిగింపునకు నోచుకోని, వీసా స్టేటస్‌లో కోరుకున్న మార్పులు పొందని వారికి ‘నోటీస్‌ టు అప్పియర్‌’(ఎన్‌టీఏ) జారీచేస్తారు. వలస విధానం పరిభాషలో ఎన్‌టీఏ అంటే.. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులను వారి దేశాలకు తిప్పి పంపించేందుకు పడిన తొలి అడుగు అని అర్థం. ఈ పత్రాలు అందినవారు ఇమిగ్రేషన్‌ జడ్జి ముందు హాజరుకావాల్సి ఉంటుంది.  

హెచ్‌–1బీ వీసాదారులకు ఊరట..
ఇటీవల కాలంలో హెచ్‌–1బీ వీసా పొడిగింపు కోసం వచ్చిన దరఖాస్తులు భారీ సంఖ్యలో తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో అధికశాతం భారతీయులవే ఉన్నాయి. అక్టోబర్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక హెచ్‌–1బీ వీసాదారులకు నోటీసులు జారీచేయమని అమెరికా ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఆ వీసా కలిగి ఉన్న భారతీయులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది.

వీసా స్టేటస్‌లో మార్పులకు నోచుకోని దరఖాస్తుదారులకు తిరస్కరణ లేఖలు పంపుతామని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. వారు ఇంకా ఎంతకాలం అక్కడ అధికారికంగా ఉండొచ్చు, ప్రయాణ నిబంధనలు, అమెరికా నుంచి పంపించేందుకు తగిన కారణాలతో కూడిన సమాచారాన్ని అందిస్తామని వెల్లడించింది. నేరచరిత్ర, మోసం, జాతీయ భద్రతలకు  కేసులను తేల్చడానికి తొలి ప్రాధాన్యమిస్తారు.

ఇప్పటికే తిరస్కరణ సులభతరం...
గ్రీన్‌కార్డు, వీసా దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా లోపించినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్‌ లేదా విజ్ఞప్తిని (హెచ్‌1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గ తంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు.

అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉం డేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్‌ ఇమిగ్రెంట్‌) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా ఈ నిబంధన ప్రభావం పడుతుంది. ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే భావిస్తున్నారు. 2013లో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో ట్రంప్‌ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది.


‘హెచ్‌–4’ వర్క్‌ పర్మిట్లు రద్దుచేయొద్దు
ట్రంప్‌ ప్రభుత్వానికి ఇద్దరు మహిళా సెనేటర్ల లేఖ
హెచ్‌–4 వీసా కలిగిన వలసదారులు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తున్న విధానాన్ని రద్దుచేయొద్దని ఇద్దరు డెమొక్రాటిక్‌ మహిళా సెనేటర్లు ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. అలా చేస్తే సుమారు లక్ష మంది మహిళలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కాలిఫోర్నియా సెనేటర్‌ కమలా హ్యారిస్, న్యూయార్క్‌ సెనేటర్‌ కిర్‌స్టన్‌ గిల్లిబ్రాండ్‌ ఈ మేరకు హోంల్యాండ్‌ భద్రతా శాఖకు, అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగాలకు లేఖ రాశారు. హెచ్‌–4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్లు రద్దుచేస్తే మహిళలు తమ కెరీర్‌లను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళలు ఆర్థిక స్వేచ్ఛ కోల్పోయి భర్తపై అతిగా ఆధారపడాల్సి వస్తుందని, అంతిమంగా భార్యాభర్తల సంబంధాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో హెచ్‌–4 వీసాదారులకు వర్క్‌ పర్మిట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. కొన్ని కంపెనీలు అమెరికా పౌరుల స్థానంలో విదేశీయులను నియమించుకునేందుకు ఈ పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నాయని, అందుకే దీన్ని రద్దుచేయబోతున్నట్లు ఇటీవల ప్రభుత్వం కోర్టుకు తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను మూడు నెలల్లో జారీచేస్తామని కూడా వెల్లడించింది.హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లకు దిగువనున్న వారి పిల్లలకు హెచ్‌–4 వీసాలను జారీచేస్తున్నారు. ఈ వీసాలను ఎక్కువగా దక్కించుకుంటున్నది భారతీయులే. ఈ నేపథ్యంలో హెచ్‌–4 వీసా కలిగి ఉన్న వారు అమెరికాలో ఉద్యోగం చేయడానికి అనుమతి నిరాకరిస్తే భారతీయులపైనే ప్రభావం పడుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు