పనుల్లో వేగం పెంచండి | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచండి

Published Fri, Sep 28 2018 2:49 AM

Telangana MPs ask South Central Railway to start new train services - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తలపెట్టిన రైల్వే పనుల్లో వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌కు ఎంపీలు విన్నవించారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో జీఎం ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, లింగయ్య యాదవ్, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్‌ఆర్‌ పాటిల్, మల్లారెడ్డి, బాల్కసుమన్, దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హాజరయ్యారు. ఆయా ఎంపీల నియోజకవర్గాల్లో జరుగుతున్న రైల్వేపనుల పురోగతి, పెం డింగ్‌ పనులు, ఆర్వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జి)లు, ఆర్‌యూబీ (రైల్వే అండర్‌ బ్రిడ్జి)లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, కొత్త లైన్‌ సర్వేలు, భూసేకరణ విషయాలపై చర్చించారు. అనంతరం చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు.

సంతృప్తికరమే: జితేందర్‌రెడ్డి
సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ పనులు కొనసాగుతున్నాయి. భూసేకరణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని జీఎంను కోరాం. షాద్‌నగర్‌ ఆర్వోబీ నిర్మాణ పనులు చేపట్టాలని విన్నవించాం.

నడికుడి రైల్వే లైన్‌ చేపట్టండి: గుత్తా, లింగయ్య
నల్లగొండలో రైల్వే ప్రాజెక్టుల పనులు సంతృప్తికరంగా లేవు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాలని  కోరాం. మాచర్ల–నల్లగొండ రైల్వే లైన్‌ 20 ఏళ్ల కింద అనుమతులొచ్చినా.. పక్కనపెట్టడం సరికాదు. ఆర్థికంగా ప్రయోజనకరమైన నడికుడి–బీబీనగర్‌ డబ్లింగ్‌ పనులను చేపట్టాలి.

హాల్టింగులు పెంచాలి: బూర నర్సయ్య
రాయగిరి స్టేషన్‌ పేరును యాదాద్రిగా మార్చాలని జీఎంను కోరాం. భువనగిరిలో శాతవాహన, నాందేడ్, విశాఖపట్నంతో పాటు పలు రైళ్లకు హాల్టింగ్‌లు ఇవ్వాలని లేఖ ఇచ్చాం. హైదరాబాద్‌–అమరావతి–మచిలీపట్నం వరకు సూపర్‌ ఫాస్ట్‌ హైస్పీడ్‌ ట్రైన్‌ వేయాలి.

రైల్వే విధానం మారాలి: విశ్వేశ్వర్‌రెడ్డి
రైల్వే విధానంలో మార్పు రావాలి. రైల్వే అన్ని వర్గాలకు అందుబాటులోకి రావాలి. సూపర్‌ ఫాస్ట్‌ పేరుతో చాలా రైళ్లను స్థానికంగా ఆపడం లేదు.

కొత్త లైన్‌ వేయండి: ఆర్‌ఆర్‌ పాటిల్‌
జహీరాబాద్‌కు కొత్త రైళ్లు వేయాలని జీఎంను కోరాం. సిద్దిపేట–సంగారెడ్డి–పటాన్‌చెరు నుంచి సికింద్రాబాద్‌కు నేరుగా లైన్‌ వేయాలని విన్నవించాం.

శివారు స్టేషన్లను అభివృద్ధి చేయండి: మల్లారెడ్డి
చర్లపల్లి టెర్మినల్‌ పనులు మొదలుపెట్టాలి. సికింద్రాబాద్‌ స్టేషన్‌పై రద్దీ భారాన్ని తగ్గించేందుకు మల్కాజ్‌గిరి, మేడ్చల్‌ వంటి శివారు స్టేషన్లను అభివృద్ధి చేయాలి.

కొత్త లైన్, రైళ్లు కావాలి: వినోద్‌
మనోహరాబాద్‌–కొత్తపల్లి రైల్వే లైన్‌కు రూ.500 కోట్లు కేటాయించారు. వచ్చే బడ్జెట్‌లో మరిన్ని నిధులివ్వాలని కోరాం. పాలమూరు నుంచి కాచిగూడ మేడ్చల్‌ నిజామాబాద్‌ వరకు కొత్త రైలు వేయాలని విన్నవించాం.

సదుపాయాలు ఏర్పాటు చేయాలి: బాల్క
పెద్దపల్లి నియోజవర్గంలోని రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాలలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులకు వీలైన సదుపాయాలు కల్పించాలని కోరాం.

రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లే: దత్తాత్రేయ
హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్‌–1, ఎంఎంటీఎస్‌–2 తెచ్చిన ఘనత బీజేపీదే. రైల్వే తరఫున పూర్తి నిధులు విడుదలయ్యేలా కేంద్రం కృషి చేసినా రాష్ట్రం వాటా అందకపోవడం వల్లే ఎంఎంటీఎస్‌–2 ప్రారంభం కావడం లేదు. సికింద్రాబాద్‌–యాదాద్రి, కాజీపేట–సికింద్రాబాద్‌ మూడో లైన్, చర్లపల్లి టెర్మినల్‌ పనులు మొదలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడమే కారణం..

సీఎం వివక్ష చూపిస్తున్నారు: నంది ఎల్లయ్య
సమావేశం నుంచి నాగర్‌కర్నూల్‌ ఎంపీ నంది ఎల్లయ్య వాకౌట్‌ చేశారు. తన నియోజకవర్గంలోని రైల్వే ప్రాజెక్టుల కోసం సీఎం అనుమతి కోసం తిరుగుతున్నా అపాయింట్‌ మెంట్‌ దొరకడం లేదని, 12 లేఖలు రాసినా స్పందన లేదని వాపోయారు. గద్వాల్‌–వనపర్తి–నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేటలలో ప్రతిపాదిత రైలు మార్గానికి రైల్వే శాఖ ఓకే చెప్పినా సీఎం ఫైల్‌పై సంతకం చేయడం లేదన్నారు.

ఆరు రెట్లు అధిక నిధులు: జీఎం వినోద్‌
2018–19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.1,890 కోట్లు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రాజెక్టులపై వెచ్చించిందని జీఎం వినోద్‌ కుమార్‌ చెప్పారు. చర్లపల్లి టెర్మినల్‌కు నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు మొదలవుతాయన్నారు. ‘తెలంగాణలో 100 కి.మీ. మేర డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులు పూర్తయ్యాయి.

ఎంఎంటీఎస్‌–2 పనులు వేగంగా నడుస్తున్నాయి. తెలంగాణ వాటా ఇంకా రూ.336 కోట్లు రావాల్సి ఉంది. అక్టోబర్‌ కల్లా తెలంగాణలో కాపలా లేని లెవెల్‌ క్రాసింగ్స్‌ ఉండవు. ఘట్‌కేసర్‌–యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి రైల్వే సిద్ధంగా ఉంది. ఇందుకు రాష్ట్రమే ముందుకురావాలి. మనోహరాబాద్‌–కొత్తపల్లి మార్గంలో భూసేకరణ వేగంగా జరుగుతోంది. కరీంనగర్‌–హసన్‌పర్తి రైల్వే లైన్‌ సర్వే వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేస్తాం’అని ఆయన చెప్పారు.  

Advertisement
Advertisement