పదవీ విరమణకు పెరుగుతున్న ప్రాధాన్యత

17 Nov, 2023 06:37 IST|Sakshi

67 % మందికి రిటైర్మెంట్‌ ప్రణాళిక

పెద్ద మొత్తంలో నిధి అవసరమన్న భావన

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం

పీజీఐఎం ఇండియా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: భారతీయుల్లో విశ్రాంత జీవనం పట్ల అవగాహన పెరుగుతోంది. గతంలో జీవిత లక్ష్యాల్లో పదవీ విరమణ ప్రణాళికకు పెద్దగా ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, పీజీఐఎం ఇడియా నిర్వహించిన ‘రిటైర్మెంట్‌ రెడీనెస్‌ సర్వే, 2023’ పరిశీలిస్తే ఈ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 67 శాతం మంది తాము రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగి ఉన్నట్టు చెప్పడం గమనార్హం. 2020లో నిర్వహించిన సర్వేలో వ్యక్తుల ఆర్థిక ప్రాధాన్యతల్లో రిటైర్మెంట్‌ (పదవీ విరమణ)కు 8వ స్థానం ఉంటే, అది ఈ ఏడాది సర్వేలో 6వ స్థానానికి చేరుకుంది. రిటైర్మెట్‌ అనేది కుటుంబ బాధ్యతల్లో భాగమని గతంలో భావించేవారు.

కానీ, కొన్నేళ్ల కాలంలో దీనికి నిర్వచనంలో మార్పు వచి్చంది. వ్యక్తిగత సరక్షణ, స్వీయ గుర్తింపునకు రిటైర్మెంట్‌ను కీలకంగా ఇప్పుడు ఎక్కువ మంది భావిస్తున్నారు. తమ కోరికల విషయంలో రాజీ పడకుండా ఆర్థిక అంశాలపై నియంత్రణను కోకుంటున్నారు. ‘‘కరోనా మహ మ్మారి కొన్ని ముఖ్యమైన అశాలను ప్రభావితం చేసినట్టు కనిపిస్తోంది. స్వీయ గుర్తింపు, స్వీయ సంరక్షణ, స్వీయ విలువ అనేవి కుటుంబ బాధ్యతల నిర్వహణతోపాటు వ్యక్తుల ప్రాధాన్య అంశాలుగా అవతరించాయి’’అని పీజీఐఎం మ్యూచువల్‌ ఫండ్‌ సీఈవో అజిత్‌ మీనన్‌ పేర్కొన్నారు.

సర్వేలోని అంశాలు
► రూ.20–50వేల మధ్య ఆదాయం కలిగిన వారిలో, రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారు 2020లో 49 శాతంగా ఉంటే.. 2023 సర్వే నాటికి 67 శాతానికి పెరిగారు.  
► రిటైర్మెంట్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2020 నాటికి రిటైర్మెంట్‌ ప్రణాళిక కలిగిన వారిలో 14 శాతం మందే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటే, తాజాగా అది 24 శాతానికి పెరిగింది.  
► పదవీ విరమణ తర్వాత జీవనానికి పెద్ద మొత్తంలో నిధి అవసరమని ఎక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు. 2020లో సగటున రూ.50 లక్షలకు ప్రణాళిక రూపొందించుకుంటుంటే, అది రూ.73.44 లక్షలకు పెరిగింది.  
► కరోనా మహమ్మారి మిగిలి్చన జ్ఞాపకాల నేపథ్యంలో మరింతగా ఇన్వెస్ట్‌ చేస్తూ, ఆర్థిక భద్రత కలి్పంచుకోవాల్సిన అవసరాన్ని మూడింట రెండొంతుల మంది గుర్తిస్తున్నారు.  
► ఆర్థిక ప్రణాళిక కలిగిన వారిలో 50 శాతం మంది పదవీ విరమణ తర్వాత ఆర్థిక మదగమనం ఏర్పడితే ఎలా అన్న ఆందోళనతో ఉన్నారు. రిటైర్మెంట్‌ తర్వాత ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, జీనవ వ్యయం ఆందోళన కలిగించే ఇతర అంశాలుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం గురించి 56 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు