అమెరికా ‘శరణార్థుల’ కోత

29 Sep, 2017 01:52 IST|Sakshi

వచ్చే ఏడాది 45 వేలకు తగ్గించనున్న ట్రంప్‌ సర్కారు

ఇది 2016 నాటి సంఖ్య కంటే దాదాపు సగం

అమెరికాకు కొత్తగా వచ్చే వారి తనిఖీలపై వచ్చే నెలలో సమీక్ష

వాషింగ్టన్‌: వచ్చే ఏడాదికి తమ దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యలో భారీగా కోతపెట్టాలని అమెరికా నిర్ణయించింది. కేవలం 45 వేల మందిని మాత్రమే శరణార్థులుగా అనుమతించాలని అమెరికా హోం ల్యాండ్‌ భద్రత అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

2016లో అనుమతించిన శరణార్థుల సంఖ్యలో ఇది దాదాపు సగం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేయగానే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ ఈ విషయాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌కు అధికారికంగా వెల్లడించనున్నారు.


తాజా ప్రతిపాదన మేరకు అక్టోబర్‌ నుంచి అమల్లోకి రానున్న 2018 ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికా నుంచి 19 వేలు, తూర్పు ఆసియా నుంచి 5 వేలు, యూరప్, మధ్య ఆసియా నుంచి 2 వేలు, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి  1500, ఎన్‌ఈఎస్‌ఏ (నియర్‌ ఈస్ట్‌ సౌత్‌ ఏసియా) దేశాల నుంచి 17 వేల మందిని అనుమతిస్తారు. ప్రతిపాదన వివరాల్ని అమెరికా అధికారి వెల్లడిస్తూ.. ‘వచ్చే ఏడాది శరణార్థుల సంఖ్యను తగ్గిస్తున్నాం. అలాగే కొత్తగా వచ్చేవారి తనిఖీల అంశంపై వచ్చే నెల్లో సమీక్ష పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేశాం’ అని పేర్కొన్నారు.

అమెరికా ప్రజల భద్రతే తమకు ముఖ్యమని, ఆ దిశగానే ఈ నిర్ణయమని ఆయన చెప్పారు. మానవతా సాయంలో అమెరికా ఇప్పటికీ ప్రపంచంలో ముందు వరుసలో ఉందని, గతేడాది రూ. 44,800 కోట్లకు పైగా సాయం చేసిందని ఆ అధికారి వెల్లడించారు. 2017లో సిరియాకు రూ. 9 వేల కోట్ల మానవతా సాయం అందించామని తెలిపారు. అయితే అమెరికా నిర్ణయాన్ని ఆ దేశ కాంగ్రెస్‌ చట్ట సభ్యులు, మానవ హక్కుల కార్యకర్తలు తప్పుపట్టారు. ‘శరణార్థుల సంఖ్యపై 45 వేల పరిమితి ఆమోదయోగ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మానవతా సంక్షోభం నేపథ్యంలో ఇలా పరిమితి విధించడం ఏమాత్రం సరికాదు’ అని సెనేటర్‌ డియన్నె ఫెయిన్‌స్టెన్‌ అన్నారు. ఈ నిర్ణయం అమానవీయమని మరో సెనేటర్‌ టామ్‌ కార్పర్‌ పేర్కొన్నారు.

 
2016లో 85 వేల శరణార్థులు:
2016లో 84,995 మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయమివ్వగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 50 వేలకు తగ్గించారు. నిజానికి ప్రపంచంలో ఎక్కువమంది శరణార్థులకు ఆశ్రయమిస్తున్న దేశం అమెరికానే.. 1980లో 2 లక్షలకు పైగా శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టారు. 1975 నుంచి ఇప్పటివరకూ 30 లక్షలకు పైగా శరణార్థులకు అమెరికా ఆహ్వానం పలికింది. కాగా ఐక్యరాజ్యసమితిలో శరణార్థుల హైకమిషనర్‌ లెక్క మేరకు ప్రపంచవ్యాప్తంగా 2.25 కోట్ల మంది శరణార్థులు ఉండగా.. 6.56 కోట్ల మంది నిర్వాసితులుగా మారారు.  

కొత్త పన్ను విధానాలు:
ట్రంప్‌ కొత్త పన్ను విధానాల్ని ప్రతిపాదించారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా ప్రస్తుతమున్న పన్ను శ్లాబుల్ని మూడు(10, 25, 35)కు తగ్గించాలని  ప్రతిపాదించారు. పన్ను మినహాయింపుల్ని కూడా రెండింతలు చేయాలని, బిజినెస్‌ పన్ను రేటును 15 శాతానికి తగ్గించాలనీ సూచించారు. ఈ ప్రతిపాదనల్ని అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదిస్తేనే అమల్లోకి వస్తాయి.  

ఏ దేశం నుంచి                     ఎంతమందికి అనుమతి
ఆఫ్రికా                                    19,000
తూర్పు ఆసియా                       5,000
యూరప్, మధ్య ఆసియా            2,000
లాటిన్‌ అమెరికా,
కరీబియన్‌ దీవులు                    1,500
నియర్‌ ఈస్ట్‌ సౌత్‌
ఏసియా దేశాలు                     17,000

ట్రంప్‌ వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన జుకర్‌బర్గ్‌
ఫేస్‌బుక్‌ ట్రంప్‌ వ్యతిరేకమని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యల్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తోసిపుచ్చారు. ప్రతి రోజూ ప్రజల్ని ఏకం చేసేందుకు ఫేస్‌బుక్‌ కృషిచేస్తుందని, ప్రజల ఆలోచనలకు ఫేస్‌బుక్‌ వేదికని ఆయన పేర్కొన్నారు. 2016 అమెరికా ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండేందుకే ఫేస్‌బుక్‌ ప్రయత్నించిందని జుకర్‌బర్గ్‌ గుర్తుచేశారు.  

>
మరిన్ని వార్తలు