షేక్‌ను వదిలి రానంటున్న రుక్సా! | Sakshi
Sakshi News home page

మాట మార్చే.. మలుపు తిరిగే..!

Published Fri, Sep 29 2017 1:53 AM

Hyderabad Girl Ruksa Refuses to Return From Oman - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: వృద్ధుడైన ఒమన్‌ షేక్‌ను వివాహం చేసుకున్న పాతబస్తీలోని ఫలక్‌నుమా బాలిక రుక్సా వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బాలికను తిరిగి రప్పించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వలేదు. తాను షేక్‌ను వదిలి రానంటూ స్పష్టం చేసింది. పాతబస్తీలోని ఫలక్‌నుమా ఠాణా పరిధిలో ఉన్న నవాబ్‌సాబ్‌ కుంట ప్రాంతంలో గత నెల 17న వెలుగులోకి వచ్చిన రుక్సా ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించింది. ఒమన్‌కు చెందిన షేక్‌ అహ్మద్‌ అబ్దుల్లా అమూర్‌ అల్‌ రహ్బీ(61) పేదింటి మైనర్లను వివాహం చేసుకోవడం కోసం మే 12న హైదరాబాద్‌ వచ్చాడు. పాతబస్తీకి చెందిన బ్రోకర్లు అహ్మద్, సికిందర్‌ ఖాన్‌ (రుక్సా మేనమామ), గౌసున్నిసా బేగం (రుక్సా మేనత్త) సాయంతో రుక్సా తల్లిదండ్రులకు ఎరవేసి మే 16న ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం దళారులకు రూ.8 లక్షలు చెల్లించాడు. అయితే, బాలిక తండ్రికి ఓ మోపెడ్, కూలర్‌ మాత్రమే కొనిచ్చి మిగిలిన మొత్తం ఖాజీలతో కలసి వీరు కాజేశారు. ఎర్రగుంటకు చెందిన ఖాజీ హబీబ్‌ అలీ వీరి నిఖా జరిపించాడు.

దౌత్యపరంగా ముందుకు...
దాదాపు వారంపాటు పాతబస్తీలోని ఓ హోటల్‌లోనే బస చేసిన షేక్‌ ఇక్కడే రుక్సాపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై అతడు తన స్వదేశానికి వెళ్లిపోయి రుక్సా పేరుతో వీసా పంపించాడు. ఆమె మైనర్‌ కావడంతో నకిలీ పత్రాల ఆధారంగా ముంబైకి చెందిన చీఫ్‌ ఖాజీ ఫరీద్‌ అహ్మద్‌ ఖాన్, మరో ఖాజీ మునావర్‌ అలీ సహకారంతో అక్కడే వివాహమైనట్లు నిఖానామా సృష్టించారు. వీటి ఆధారంగా రుక్సాకు వీసా సంపాదించి ఒమన్‌కు పంపారు. అక్కడకు వెళ్లిన రుక్సాపై షేక్‌తోపాటు అతడి బంధువులు సైతం లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ విషయాలను ఆమె ఫోన్‌ ద్వారా తన కుటుంబీకులకు తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాలిక తల్లి సైదా ఉన్నీసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, తనను షేక్‌ ఎలాంటి ఇబ్బందులకు గురి చేయట్లేదని, తాను అతడిని వదిలిరానని రుక్సా స్పష్టం చేసింది. రుక్సా మైనర్‌ కావడం, షేక్‌తో జరిగిన వివాహం చెల్లుబాటు కాకపోవడంతో ఆమెను ఇక్కడికి రప్పించేందుకు దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. రుక్సా వివాహం తల్లిదండ్రుల సమక్షంలోనే జరిగినట్లు ఆధారాలుండడంతో వారిపైనా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
Advertisement