Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై బైడెన్‌ అసంతృప్తి!

14 Dec, 2023 04:28 IST|Sakshi

వాషింగ్టన్‌: గాజాలో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న దండయాత్రను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తొలిసారిగా తప్పుబట్టారు. బుధవారం వాషింగ్టన్‌లో నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇజ్రాయెల్‌ యుద్ధరీతిపై బైడెన్‌ మాట్లాడారు. ‘‘ ఇజ్రాయెల్‌ భద్రత అనేది అమెరికాతో ముడిపడి ఉంది. ఇన్నాళ్లూ ఐరోపా సమాఖ్య, యూరప్‌ దేశాలూ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలబడ్డాయి. కానీ ఇప్పుడా పరిస్థితి నెమ్మదిగా మారుతోంది.

గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న విచక్షణారహిత బాంబుదాడులే ఇందుకు ప్రధాన కారణం. మరి ఈ విషయం ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు తెలుసో తెలీదో. గాజావ్యాప్తంగా ఇళ్లలో ఉన్న సాధారణ ప్రజానీకాన్ని చిదిమేస్తూ భవనాలపై దారుణ బాంబింగ్‌ కొనసాగుతోంది. ఈ దాడుల పర్వం మరికొన్ని వారాలు, నెలలపాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్‌ సైన్యాధికారులే చెబుతున్నారు.

అమా యక పాలస్తీనియన్ల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది’’ అని ఇజ్రాయెల్‌ భీకర గగనతల, భూతల దాడులను బైడెన్‌ ఆక్షేపించారు. ఈ విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌ ఈ వారమే ఇజ్రాయెల్‌లో పర్యటించి భారీ దాడులకు ఎప్పుడు చరమగీతం పాడుతారనే దానిపై ఒక హామీ తీసుకోనున్నారు. ‘‘ 2001 సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అమెరికా అఫ్గాని స్తాన్‌లో యుద్ధానికి దిగింది.

అమెరికా చేసిన ఇలాంటి అతి ‘స్పందన’ తప్పిదాల నుంచి ఇజ్రాయెల్‌ ఏమీ నేర్చుకున్నట్లు కనిపించట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మద్దతును ఇజ్రాయెల్‌ కోల్పోతుంది’’ అని బైడెన్‌ హెచ్చరించారు. బైడెన్‌ వ్యాఖ్యలపై హమాస్‌ సాయుధసంస్థ ప్రతినిధి బీరుట్‌ నగరంలో మాట్లాడారు. ‘‘ఈ యుద్ధ విపరి ణామాలు ఇజ్రాయెల్‌లో త్వరలోనే కనిపిస్తాయి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తర్వాత శ్వేతసౌధంలో బైడెన్‌ సీటు గల్లంతవుతుంది’’ అని హమాస్‌ రాజకీయవిభాగం నేత ఒసామా హమ్దాన్‌ వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు