ఇక మంచివాడిని కాను: ట్రంప్

31 Jul, 2016 01:53 IST|Sakshi
ఇక మంచివాడిని కాను: ట్రంప్

హిల్లరీ తనకు అభినందనలు చెప్పలేదంటూ ధ్వజం
 

 వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విషయంలో తాను ఇక ఏమాత్రం ‘మంచి మనిషి’గా వ్యవహరించబోనని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కొలరాడోలో శుక్రవారం జరిగిన పార్టీ ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఈ పోరులో ఇక నిర్దయగా వ్యవహరిస్తానన్నారు. హిల్లరీ గురువారం పార్టీ జాతీయ సదస్సులో చేసిన ప్రసంగంలో.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందినందుకు తనకు అభినందనలు చెప్పకపోవటాన్ని తప్పుపడుతూ ఆమె గొంతును అనుకరించి ఎద్దేవా చేశారు.

ట్రంప్ మరో సభలో మాట్లాడుతూ.. తనపై విమర్శలు చేసిన డెమోక్రటిక్ నేతలకు దిమ్మతిరిగిపోయేలా బుద్ధి చెప్తానన్నారు. హిల్లరీకి నిర్ణయం తీసుకోవటం రాదంటూ.. జాతీయ భద్రతపై అధికారిక సమాచారం చెప్పొద్దని ఆ తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. పార్టీ జాతీయ సదస్సులో హిల్లరీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కునుకుతీస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ.. ఆమె ‘అబద్ధాలతో బిల్ కూడా విసిగిపోయార’ని విమర్శించారు.  కాగా  పార్టీ నామినేషన్‌లను స్వీకరిస్తూ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని  3.22 కోట్ల  మంది,  హిల్లరీ చేసిన ప్రసంగాన్ని 2.98 కోట్ల మంది టీవీల్లో చూశారని ఓ  సర్వేలో తేలింది.

మరిన్ని వార్తలు