ఏం జరిగినా జడ్జిదే బాధ్యత

7 Feb, 2017 01:18 IST|Sakshi
ఏం జరిగినా జడ్జిదే బాధ్యత

►  ప్రయాణ నిషేధ ఉత్తర్వుల్ని అడ్డుకోవడంపై ట్రంప్‌ మండిపాటు
► అమెరికన్లు ఆ జడ్జినే ప్రశ్నించాలంటూ అమెరికా అధ్యక్షుడి ట్వీట్‌
► పుతిన్ ను గౌరవిస్తా.. రష్యాతో కలిసి సాగడం మంచిది: ట్రంప్‌  

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి ఏ దేశాధినేతో లేక వ్యతిరేకులపైనో కాకుండా ఏకంగా జడ్జిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై నిషేధాన్ని అడ్డుకున్నందుకు శాన్  ప్రాన్సిస్కో జిల్లా జడ్జి జేమ్స్‌ రాబర్ట్‌ను ట్వీటర్‌లో తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఏదైనా జరిగితే అమెరికన్లు ఆ జడ్జినే తప్పుపట్టాలంటూ ట్వీట్‌ చేశారు. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేమ్స్‌ రాబర్ట్‌ శనివారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

‘మన దేశాన్ని ఇలాంటి ఆపదలోకి ఒక జడ్జి నెడతారనే విషయం నమ్మలేకుండా ఉన్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ జడ్జిని, న్యాయవ్యవస్థనే తప్పుపట్టండి. శరణార్థులు ప్రవాహంలా వస్తున్నారు. ఇది విచారకరం’ అంటూ సోమవారం ట్వీట్‌ చేశారు. శాన్  ఫ్రాన్సిస్కో కోర్టు ఆదేశాలపై వైట్‌హౌస్‌ అప్పీలును తొమ్మిదో సర్క్యూట్‌ కోర్టు తోసిపుచ్చిన అనంతరం ట్రంప్‌ వరుస ట్వీట్లు చేశారు.

నిషేధం సరైనదే: సమర్ధించుకున్న ట్రంప్‌
‘అమెరికాకు వచ్చే వారిని చాలా జాగ్రత్తగా తనిఖీ చేయమని హోం ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారుల్ని ఆదేశించా. మేం చేయాల్సిన పనిని కోర్టులు చాలా కఠినం చేశాయి. జడ్జి అభిప్రాయం హాస్యాస్పదం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.  

అమెరికా ఏమైనా అమాయక దేశమా?
రష్యా అధ్యక్షుడు పుతిన్  పాలనను ఒకవైపు తప్పుపడుతూనే మరోవైపు ఆ దేశానికి ట్రంప్‌ స్నేహ హస్తం అందించారు. పుతిన్  పాలనలో జరిగిన హత్యలతో పాటు అమెరికా చేసిన తప్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు మరణించారంటూ ఫాక్స్‌ న్యూస్‌ ఇంటర్వూ్యలో వెల్లడించారు. పుతిన్   హంతకుడు కదా? అని విలేకరి ప్రశ్నించగా... ‘అవును... అనేక తప్పులు జరిగాయి. అనేకమంది హత్యకు గురయ్యారు. అయితే మన వద్ద కూడా చాలామంది హంతకులు ఉన్నా రు. అమెరికాను అమాయక దేశంగా భావిస్తున్నారా?’ అంటూ ట్రంప్‌ ప్రశ్నించారు.

రష్యా సహకారం తీసుకుంటా
ఐసిస్‌పై పోరులో రష్యాతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ‘నేను పుతిన్ ను గౌరవిస్తాను. అయితే దానర్థం స్నేహితులని కాదు. నేను అనేక మంది ప్రజల్ని గౌరవిస్తాను. అంతమాత్రాన వారితో నేను వారితో స్నేహం చేయాలని ఆశిస్తున్నట్లు కాదు. పుతిన్  రష్యా అధినేత. ఐసిస్‌పై పోరులో మనకు సాయం చేస్తే... రష్యా తో కలిసి సాగడం మంచిదని నేను చెప్పగలను’ అంటూ ప్రకటించారు. రష్యాతో సంబంధాలపై ట్రంప్‌ వ్యాఖ్య ల్ని డెమోక్రటిక్‌ పార్టీ సెనెటర్లు తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు