కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం

28 Dec, 2019 01:43 IST|Sakshi

12 మంది మృతి

అల్మేటీ: కజకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద నగరం అల్మేటీ నుంచి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సుమారు వంద మందితో టేకాఫ్‌ తీసుకున్న విమానం ఆ తరువాత కొద్దిసేపటికే కూలిపోయింది. బెక్‌ ఎయిర్‌ అనే విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం రాజధాని నూర్‌ సుల్తాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం రాడార్‌లో కనిపించకుండా పోయిందని, అల్మేటీ సరిహద్దుల్లోని ఓ రెండంతస్తుల భవనంపై కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

విమానం కూలిపోయిన ధాటికి విమానం రెండు ముక్కలైందని, ప్రాణాలతో ఉన్న వారిని శకలాల నుంచి వెలికి తీసేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా కెప్టెన్‌తోపాటు 11 మంది మరణించినట్లు ఆ ప్రకటన వివరించింది. ఈ దుర్ఘటనలో 53 మంది గాయపడ్డారని, వీరిలో తొమ్మిది మంది పిల్లలూ ఉన్నారని తెలిపింది, ఘటనపై విచారణ జరపడంతోపాటు, బెక్‌ ఎయిర్‌ సంస్థ వాడుతున్న ఫొక్కర్‌ మోడల్‌ విమానాలపై కజకిస్థాన్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానం టేకాఫ్‌ తీసుకునే సమయంలోనే దాని తోకభాగం రన్‌వేను రెండుసార్లు తాకిందని, ఇది పైలట్‌ తప్పిదమా? లేదా సాంకేతికపరమైన సమస్య? అన్నది తేల్చాల్సి ఉందని ఉప ప్రధాని స్కైలార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు