రూ. 100 కోట్ల బడ్జెట్‌.. 18 భాషల్లో విడుదల..కృతి శెట్టికి లక్కీ ఛాన్స్‌

3 Dec, 2023 06:42 IST|Sakshi

కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఈయన చిత్రాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి కొత్తదనం ఉన్న చిత్రాలను చేస్తుంటారు. పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి చరిత్రాత్మక కథా చిత్రంలో నటించి, ఆ తరహా కథా పాత్రల్లోనూ సత్తా చాటారు. ఆ చిత్రం మంచి విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన ఇరైవన్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి జీనీ. ఇందులో జయం రవి సరసన కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్‌, వామిక కబీ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

దర్శకుడు అర్జునన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరీ గణేష్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దీనిని రూ.100 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా చిత్రాన్ని 18 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా పొన్నియిన్‌సెల్వన్‌ చిత్రాన్ని పక్కన పెడితే జయం రవి నటిస్తున్న రూ.100 కోట్ల బడ్జెట్‌ చిత్రం ఇదే అవుతుంది. ఇది ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం.

దీనికి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో జీవీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు సైరన్‌, బ్రదర్‌ తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా తనీ ఒరువన్‌, ఎం.కుమరన్‌ సన్‌ఆఫ్‌ మహాలక్ష్మి చిత్రాల సీక్వెల్స్‌లో నటించేందుకు జయం రవి సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు