భారత్, పాక్‌లకు అమెరికా ఆయుధాలు

28 Jul, 2019 04:43 IST|Sakshi

వాషింగ్టన్‌: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికాను సందర్శించిన కొద్దిరోజులకే అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు రూ.860.75 కోట్ల ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ కాంగ్రెస్‌(పార్లమెంటు)కు తెలిపింది. ఈ ఒప్పందం కింద పాకిస్తాన్‌కు గతంలో అమ్మిన ఎఫ్‌–16 ఫైటర్‌జెట్లను 24 గంటల పాటు పర్యవేక్షిస్తామనీ, ఇందుకు 60 మంది కాంట్రాక్టర్లను నియమిస్తామని వెల్లడించింది.

పాకిస్తాన్‌కు తాము ఎలాంటి ఆర్థికసాయం అందించడం లేదనీ, మొత్తం రూ.860.75 కోట్లను పాక్‌ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పాక్‌కు గతంలో ఆర్థికసాయాన్ని నిలిపివేయడంపై అధ్యక్షుడు ట్రంప్‌ ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని తేల్చిచెప్పింది. మరోవైపు భారత్‌కు రూ.4,613 కోట్ల విలువైన ఆయుధాలను అమ్మేందుకు అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పంద కింద బోయింగ్‌ సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ సైనిక రవాణా విమానానికి కావాల్సిన పరికరాలు, సిబ్బందికి శిక్షణ, శిక్షణా పరికరాలను అందిస్తామని చెప్పింది. యుద్ధసమయాల్లో సైన్యాన్ని తరలించేందుకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ సీ–17 విమానాన్ని వినియోగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు