లైంగిక ఆరోపణలపై యుఎస్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు రాజీనామా

28 Oct, 2019 15:57 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికన్‌ కాంగ్రెస్‌లో పనిచేసే ఓ ఉద్యోగితో శారీరక సంబంధం కలిగిఉందనే ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ విచారణను ఎదుర్కొంటున్న అమెరికన్‌ డెమొక్రాట్‌ సభ్యురాలు కేటీ హిల్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2018 నవంబర్‌లో కాలిఫోర్నియా నుంచి యూఎస్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైన డెమొక్రాట్‌, 32 సంవత్సరాల హిల్‌ తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సమాజం, దేశం, తన ప్రాంత ప్రయోజనాల కోసం ఇది సముచితమైన నిర్ణయమని ఆమె వ్యాఖ్యానించారు.

గతంలో తాను అమెరికన్‌ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన సమయంలో తన ప్రచార సిబ్బందిలో ఒకరితో అభ్యంతరకర సంబంధం నెరపిన విషయం వాస్తవమేనని హిల్‌ అంగీకరించారు. అయితే తన కార్యాలయ సిబ్బందితో తనకు లైంగిక సంబంధం లేదని నిరాకరించారు. మరోవైపు చట్టసభకు సంబంధించి ఆమెకు కేటాయించిన సిబ్బందితో హిల్‌కు అనైతిక బంధం ఉందనే ఆరోపణలపై విచారణ జరుగుతోందని ఎథిక్స్‌ కమిటీ పేర్కొంది.

భర్తతో విడాకుల ప్రక్రియ సాగుతున్న క్రమంలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని హిల్‌ మండిపడ్డారు. అభ్యంతరకర ఫోటోలు విడుదల చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. వ్యక్తిగత క్షణాల్లో తీసుకున్న ప్రైవేట్‌ ఫోటోలను తనకు వ్యతిరేకంగా ఆయుధంలా వాడటం చట్టవిరుద్ధమని, అది తన గోప్యతపై దండెత్తడమేనని ఆమె దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు