లాక్‌డౌన్‌తో విసుగెత్తిపోయిన పైలట్‌.. ఫన్నీ వీడియో!

13 May, 2020 14:59 IST|Sakshi

కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరిగే వాళ్లను కూడా ఒకచోట స్థిరంగా ఉండేలా చేసింది మహమ్మారి కరోనా. అవును మరి.. ప్రాణాంతక వైరస్‌ ప్రబలుతుందంటే ఆమాత్రం క్రమశిక్షణ పాటించి తీరాల్సిందే. అందుకే అందరిలాగే నయా ఖన్‌కన్‌ కూడా ఇంటికే పరిమితమైంది. డెన్మార్క్‌కు చెందిన ఆమె.. పైలట్‌గా పనిచేస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి‌ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ ప్రభావం తొలుత రవాణా వ్యవస్థ మీదే పడిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎల్లప్పుడు విహంగం మాదిరి ఆకాశంలో ఎగిరే నయాకు ఇంట్లోనే ఉండటంతో బాగా బోర్‌ కొట్టినట్టుంది.(వైరల్‌ వీడియో.. పాఠశాలలో కరోనా మార్పులు)

ఏదైతే అది అయిందనుకుని విమానం ఎక్కేసి ఎంచక్కా కిటికీ పక్కన కూర్చుని బయటి ప్రపంచాన్ని చూస్తూ మైమరచిపోయింది. అదేంటి లాక్‌డౌన్‌లో తనెలా విమానం ఎక్కిందని ఆశ్చర్యపోతున్నారా.. అవును.. తను షేర్‌ చేసిన వీడియో చూడగానే ఎవరికైనా ఈ సందేహం రాకమానదు. అయితే వీడియోను పూర్తిగా చూసిన తర్వాతే అది విమానం కిటీకి కాదు.. వాషింగ్‌ మెషీన్‌ డోర్‌ అనే విషయం అర్థమవుతుంది. లాక్‌డౌన్‌ వల్ల తన సోదరి ఇంట్లో చిక్కుకుపోయిన నయా.. ఈ విధంగా కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ తెప్పించిన చిరాకును ఫన్నీ వీడియో ద్వారా బయటపెట్టారు. కాగా మార్చి రెండో వారం నుంచి డెన్మార్క్‌లో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇక ఇప్పటి వరకు అక్కడ దాదాపు 10 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సమాచారం. (ఈ ఉడుత.. మరో బాబా రాందేవ్‌)

>
మరిన్ని వార్తలు